ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్!

ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్!

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను కట్టుకుంటే కరెంట్​కట్ చేస్తున్నారు. బొల్లారం మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ఇంటికి ఒక్కో రకంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారు. అటు పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ పరిస్థితి.. 

లక్ష్మీపతి గూడెంలో వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని టార్గెట్​ పెట్టుకున్న పంచాయతీ పాలకవర్గం పన్ను బకాయిదారుల  ఇంటి విద్యుత్ కనెక్షన్, పెన్షన్​ తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి పెన్షన్​ జోలికి వెళ్లకుండా కరెంట్ కనెక్షన్​ కట్​ చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటి పన్నుకు కరెంట్ కు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఇళ్లకు కరెంట్ కట్ చేయగా రాజకీయ ఒత్తిడితో ఒకటి, రెండు ఇళ్లకు ప్రాపర్టీ టాక్స్ కట్టకుండానే తిరిగి కరెంట్ సరఫరా చేశారు. ముందస్తు దండోరా వేయించకుండా పాలకవర్గం ఇష్టారీతిగా వ్యవహరించడం పట్ల మండిపడుతున్నారు. ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేయకుండా కరెంట్ కట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. బొల్లారం మున్సిపాలిటీలో భారీగా ప్రాపర్టీ టాక్స్ లు పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతంతో పోలిస్తే నాలుగు రేట్లు పన్నులు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ బలియాలో కార్మికులు, పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ. పట్టణంలో ఎక్కువగా రేకుల ఇండ్లు, 100 గజాల లోపు ఇండ్లు ఉన్నాయి. గతంలో రెండు గదుల రేకుల ఇంటికి రూ.500 పన్నులు ఉండగా ప్రస్తుతం అదే ఇంటికి రెండు రూ.2 వేలు పెంచినట్టు బాధితులు తెలిపారు. పక్క పక్కనే ఉంటున్న ఇండ్లకు వేర్వేరుగా పన్నులు విధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పన్నులు పెంచడాన్ని అధికార పార్టీ కౌన్సిలర్లు, ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఆస్తుల విలువలు పెరగడంతోనే పన్నులు కూడా పెంచినట్టు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

వసూళ్ల కోసమే ఈ నిర్ణయం.. 

గ్రామ పంచాయతీలో ఆస్తి పన్నులు చాలాకాలంగా పెరిగిపోయాయి. పన్నులు చెల్లించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే పెండింగ్ పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ల ఇంటికి కరెంట్ కట్ చేయాలని పంచాయతీ తీర్మానించింది. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ప్రస్తుతానికి దానిని వాయిదా వేశాం.
- లావణ్య, సర్పంచ్ లక్ష్మీపతి గూడెం


జీవో ప్రకారమే వసూలు.. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల మాదిరిగానే బొల్లారం మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నాం. ఎవరికీ అన్యాయం చేయడం లేదు. అందరికీ ఒకేలా ప్రభుత్వ జీవో ప్రకారం పన్నులు వసూలు చేస్తున్నాం. 
- రాజేంద్ర కుమార్, బొల్లారం మున్సిపల్ కమిషనర్