- జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర
- ఫిబ్రవరి 25 నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు
- ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు టెన్త్ ఎగ్జామ్స్
హైదరాబాద్, వెలుగు:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. జనవరి మొదటి వారంలోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తోంది. ఒకవేళ డిసెంబర్లో జరగకపోతే.. స్థానిక ఎన్నికలు ఏప్రిల్ వరకు వాయిదా పడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కుంభమేళా ‘మేడారం మహా జాతర’ జనవరి చివరలో జరగనున్నది. ఆ తర్వాత ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఇటు జాతర పనులు, ఏర్పాట్లు, అటు పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పీఆర్ అధికారులు, సిబ్బందితోపాటు టీచర్లు, ఇతర ఉద్యోగులు కీలకం.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనవరి మొదటి వారంలోపే ఎన్నికలు పూర్తి చేయడంలో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. హైకోర్టు కూడా స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారనేదానిపై ఈ నెల 24లోపు సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
అన్నీ సిద్ధమే.. రిజర్వేషన్లపైనే క్లారిటీ రాలే
స్థానిక ఎన్నికల ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైనది. నోటిఫికేషన్‌కు ముందే అనేక కీలక దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా, జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన, ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ వంటివన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కేవలం రిజర్వేషన్లపైనే పీటముడి పడింది. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కుదరకపోతే.. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రిజర్వేషన్లకు రెండు రోజుల టైం పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇస్తే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధం ఉంది. పైగా విడతల వారీగా ఎన్నికలను నిర్వహిస్తే.. ఒక్క ఎన్నికల నోటీసు(నోటిఫికేషన్)కు మరొక దానికి ఐదు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉండొద్దని చట్టం చెబుతోంది. దీంతో డిసెంబర్10 తరువాత ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలు నిర్వహించాల్సి ఉంటుంది.
జనవరిలో జాతర, ఫిబ్రవరి నుంచి పరీక్షలు..
ఎన్నికల ప్రక్రియకు వెన్నెముక లాంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది జనవరిలో మేడారం జాతరలో నిమగ్నమవుతారు. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. అందుకే ఈ రెండింటినీ ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని భావిస్తున్నారు. కాగా, జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్నది.
ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు ముగియడానికి 22 రోజుల సమయం పడుతుంది. మార్చి 18న నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కావడానికి 18 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ అంతకుముందే డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేయాల్సి ఉంటుంది.
12,733 పంచాయతీలు, 5,749 ఎంపీటీసీలకు ఎన్నికలు
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 565 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో జరగనున్నాయి.
జాతరలోపు నిర్వహించేలా?
మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో అధికార యంత్రాంగమంతా ఇక్కడే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి రానుండటంతో వారికి ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. దాదాపు 20 నుంచి 30 రోజులు అక్కడే మకాం వేస్తారు.
ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ కార్యదర్శుల వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీస్ అందించ నున్నారు. అంతేకాకుండా, గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావుడిలో ఉంటారు. అందుకే సంకాంత్రి తరువాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.
