జనసేన అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు ఉండవు

జనసేన అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు ఉండవు

జనసేన అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు ఉండవని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన ఆయన 80మంది కౌలు రైతులకు లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. అనంతర పర్చూరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతులను గుర్తించి ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. తాము అధికారంలోకి వస్తే  వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. వైసీపీ నమ్మి ఓట్లేసిన ప్రజలకు నిరాశే ఎదురైందని..గత మూడేళ్లలో 3వేల మంది కౌలు రైతులు చనిపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా,మద్యపాన నిషేధం వంటి ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. 

వైసీపీ నాయకులకు లక్ష కోట్లు దోపిడి చేసే సత్తా ఉన్నప్పుడు..జనసేనకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నుండి ఏపీకి అన్యాయమే జరుగుతోందని..వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి బిజినెస్లు చేస్తున్నారని ఆరోపించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని..బాధ్యతల గల వ్యక్తులను అసెంబ్లీకి పంపాలని కోరారు. జనసేన అధికారంలోకి వచ్చాక అవినీతి చేసేవారికి ప్రజాకోర్టులో శిక్షవేస్తామన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదని..తమకు ప్రజలతో మాత్రమే పొత్తు అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా వేధిస్తున్నారన్న పవన్..రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ముందుకు తీసుకెళ్లడం తప్ప వ్యక్తిగత స్వార్ధంలేదని..దసరా నుంచి ప్రజాసమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.