పైసా పంచకుండా బీజేపీ గెలుస్తది.. వచ్చేది మా ప్రభుత్వమే : అర్వింద్

పైసా పంచకుండా బీజేపీ గెలుస్తది.. వచ్చేది మా ప్రభుత్వమే : అర్వింద్
  • మా అమ్మమ్మది ఇదే ఊరు: అర్వింద్

కోరుట్ల, వెలుగు: సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్.. సిరిసిల్లలో లోకల్ అయితే.. ధర్మపురి శ్రీనివాస్ కొడుకైన తాను కోరుట్లలో లోకల్ అవుతానని ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను కోరుట్లకు చెందిన రేగుల కాశీరాం, గడిసెల గంగవ్వ మనమడినని, ధర్మపురి విజయలక్ష్మి కొడుకును అని అన్నారు. బీజేపీ కోరుట్ల అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ఎంపీ అర్వింద్ కోరుట్లలో శుక్రవారం కార్యకర్తలతో మాట్లాడారు. ‘‘గవర్నమెంట్ హాస్పిటల్స్​లో డాక్టర్లు లేరు. కంటి వెలుగు స్కీమ్ పేరుతో కేసీఆర్ కోట్లు వెనకేసుకున్నడు. నేను ఎంపీగా గెలవడంలో కోరుట్ల ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. కోరుట్ల నా అమ్మమ్మ ఊరు. జగిత్యాల అసెంబ్లీ టికెట్ పద్మశాలి సామాజిక వర్గా నికి చెందిన డాక్టర్ భోగ శ్రావణికి ఇప్పించాం. ఆమెను అసెంబ్లీకి పంపాలి’’ అని అర్వింద్ కోరారు. పైసా పంచకుండా రాష్ట్రంలో బీజేపీ గెలుస్తది అని అన్నారు.

కోరుట్ల గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు

కోరుట్లలో బీజేపీ గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయని ఎంపీ అర్వింద్ అన్నారు. భారీ మెజార్టీతో బీజేపీ అటు రాష్ట్రంలో, ఇటు కోరుట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీజేపీ కార్యకర్తలతో టచ్​లోకి వస్తున్నడు. పరస్పర సహకారం ఇవ్వాలని కోరుతున్నడు. ఎమ్మెల్యే అనుచరులు కూడా నాకు టచ్​లోకొచ్చారు. బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఎవరూ బీఆర్ఎస్​లో చేరే ప్రసక్తే లేదు. విద్యాసాగర్ రావు ఓడిపోవడం ఖాయం. తెలంగాణలో కేసీఆర్, కోరుట్లలో విద్యాసాగర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాం” అని అర్వింద్ అన్నారు. కార్యకర్తలు కష్టపడి పని చేస్తే బీజేపీ పక్కా గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవినీతిపై ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రశ్నించలేదని మండిపడ్డారు.

మూడేండ్లకే ఎట్ల కుంగుతది?

మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేండ్లకే కుంగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల నిధులను నట్టేట ముంచారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్ మోసకారి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కోరుట్లకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్, సునీత, రఘు, గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.