పాకిస్థాన్ దాడి చేస్తే రాష్ట్రాలే ఎదుర్కోవాలా?

పాకిస్థాన్ దాడి చేస్తే రాష్ట్రాలే ఎదుర్కోవాలా?

న్యూఢిల్లీ: విదేశీ టీకా సంస్థల నుంచి వ్యాక్సిన్ లను తెప్పించడం రాష్ట్రాలకు కష్టమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే కేంద్రం సత్వరం పెద్ద ఎత్తున టీకాలను కొనుగోలు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ తయారీదారులతో కేంద్ర ప్రభుత్వమే నేరుగా చర్చలు జరపాలన్నారు. 

'కేంద్రం టీకాలను ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఈ పనిని రాష్ట్రాలకు వదిలేస్తే ఎలా? మనం కరోనాతో యుద్ధం చేస్తున్నాం. ఒకవేళ పాకిస్థాన్ మన దేశం మీదకు యుధ్ధానికి వస్తే పోరాడే బాధ్యతను రాష్ట్రాలకు వదిలేస్తారా?' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ విషయంలో భారత్ ఆరు నెలలు ఆలస్యం చేసిందన్నారు. ప్రపంచంలో తొలి టీకాను భారతే తయారు చేసిందని.. కానీ వ్యాక్సినేషన్ విషయంలో మిగతా దేశాల కంటే వెనుకబడ్డామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తి వేగాన్ని పెంచి ప్రజలకు ఇచ్చుకుంటూ వెళ్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడే వాళ్లమన్నారు.