- బిహార్ అసెంబ్లీలో బిల్లు ఆమోదం
పాట్నా: నీట్-యూజీ పరీక్ష సహా పలు పేపర్ లీకేజీలకు కేంద్రబిందువుగా మారిన బిహార్ ప్రభుత్వం.. పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు బుధవారం కఠినమైన బిల్లును ఆమోదించింది. బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు, 2024 ను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అయితే, బిహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో, వాయిస్ ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ప్రకారం.. ఇక మీదట ఎవరైనా పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 ఏండ్ల నుంచి 5 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. అలాగే, దోషులుగా తేలిన వారి ఆస్తులను అటాచ్ చేయడం, తొందరగా బెయిల్ కూడా పొందకుండా కఠినమైన నిబంధనలతో ఈ బిల్లును రూపొందించారు.
మహిళా ఎమ్మెల్యేపై సీఎం నితీశ్ ఆగ్రహం
బిహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు నితీశ్ కుమార్‌పై సభలో దాడి చేశాయి. ఈ సందర్భంగా నితీశ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన నితీశ్.. ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖా దేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు మహిళవు. నీకు ఏమైనా తెలుసా? చూడండి ఆమె ఏం మాట్లాడుతోంది. మీరు (ప్రతిపక్షం) మహిళల కోసం ఏమైనా చేశారా? మేము మాట్లాడుతాం. మీరు వినకపోతే, అది మీ తప్పు”అంటూ ఫైర్ అయ్యారు. కాగా, సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. మహిళలపై చౌకబారు, నీచమైన వ్యాఖ్యలు చేయడం సీఎం నితీశ్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు.