సమస్యలు పరిష్కరించకుంటే ఆర్టీసీ సమ్మె తప్పదు

సమస్యలు పరిష్కరించకుంటే ఆర్టీసీ సమ్మె తప్పదు
  •                 రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక
  •                 సమ్మె చేయాల్సి వస్తే ప్రభుత్వానిదే బాధ్యత
  •                 నాలుగు సంఘాలతో ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు

ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించకపోతే ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. నష్టాలు వస్తున్నాయంటూ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించేదాకా పోరాడుతామని తెలిపింది. ఆర్టీసీలోని ప్రధాన సంఘాలు టీఎంయూ, ఈయూ, ఎస్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌, సూపర్‌‌‌‌వైజర్స్‌‌‌‌ అసోసియేషన్లు శుక్రవారం ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని బస్​ భవన్​లో జేఏసీ నేతలు మాట్లాడారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని.. అందుకే ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో జేఏసీ ఏర్పడిందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి చెప్పారు. దశలవారీగా ఉద్యమం చేస్తామని, ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని బస్​ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమ్మె అనివార్యమయ్యే పరిస్థితే వస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనంపై పంజాబ్, హర్యానాలకు వెళ్లి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చామని, దాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదని మండిపడ్డారు. సంస్థ నష్టాల్లో లేదని, ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నష్టాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.

అందరూ కలిసి రావాలి..

ఆర్టీసీ కార్మికులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఈ నెల 23న చర్చలకు రావాలని లేబర్  కమిషనర్  నుంచి పిలుపు వచ్చిందని, జేఏసీ తరఫున హాజరవుతామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి అన్ని యూనియన్లు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి రోజూ వచ్చే ఆదాయంలో 40శాతం ప్రభుత్వానికి పన్నుల రూపంలో కడుతున్నామని, వాటిని మినహాయించాలని ఎస్‌‌‌‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు కోరారు. గతంలో రైతులు, నేతన్నల ఆత్మహత్యలు చూశామని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చూస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్టీసీలో మరో జేఏసీ

ఐదు యూనియన్లతో ‘ జేఏసీ వన్’ ఏర్పాటు

ఆర్టీసీలో సమస్యల పరిష్కారం కోసం కొన్ని యూనియన్లు కలిసి ఇప్పటికే ఓ జేఏసీ ఏర్పడగా.. ఐదు యూనియన్లతో మరో జేఏసీ ఏర్పాటైంది. తెలంగాణ జాతీయ మజ్దూర్‌‌‌‌ యూనియన్‌‌‌‌, కార్మిక సంఘ్‌‌‌‌ (కేఎస్‌‌‌‌ బీఎంఎస్‌‌‌‌), బహుజన కార్మిక యూనియన్‌‌‌‌, బహుజన వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌, సామాజిక తెలంగాణ మజ్దూర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ కలిసి ‘ఆర్టీసీ జేఏసీ వన్‌‌‌‌’గా ఏర్పాటయ్యాయి. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో జరిగిన సమావేశంలో యూనియన్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. జేఏసీ కన్వీనర్‌‌‌‌గా హనుమంతు ముదిరాజ్‌‌‌‌, కో–కన్వీనర్లుగా రమేష్‌‌‌‌ కుమార్‌‌‌‌, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్‌‌‌‌, పున్న హరికిషన్‌‌‌‌ నేత ఎన్నికయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధాన ఎజెండాతో జేఏసీ వన్‌‌‌‌ను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్‌‌‌‌ చెప్పారు.