వల్లభభాయి పటేల్‌ ఒక కర్మయోగి : అమిత్ షా

 వల్లభభాయి పటేల్‌ ఒక కర్మయోగి :  అమిత్ షా

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభభాయి పటేల్‌ దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే దేశంలో ఇన్ని సమస్యలు ఉండేవి కావని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా  సర్దార్ పటేల్ విద్యాలయలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం 500 కంటే ఎక్కువ రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్ కీలకమైన పాత్రను పోషించారని గుర్తు చేశారు. పటేల్ గొప్ప విజనరీయే కాదు..ఆయనొక కర్మయోగి అని కొనియాడారు.

ఇండియా మ్యాప్ మరోలా ఉండేది

పటేల్‌ ఆశయాలను అర్థం చేసుకునేందుకు ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని విద్యార్థులకు  అమిత్ షా సూచించారు. పటేల్ లేకపోతే  ఇండియా మ్యాప్ ఈనాటిలా ఉండేది కాదన్నారు. ఆయన లక్షద్వీప్, జోధ్‌పూర్, జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్‌లను ఒకచోట చేర్చారన్నారు. సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి అనేక ఇతర సంస్థలకు పునాదులు వేసింది పటేలేనని చెప్పారు. పటేల్‌ జయంతిని 2014 నుండి కేంద్ర ప్రభుత్వం  జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తుంది. 

మాతృభాషను మరవొద్దు

మాతృభాషలో మాట్లాడటాన్ని అగౌరవంగా చూడొద్దని, ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను పరిరక్షించుకోవాలని అమిత్ షా కోరారు. పర భాషలను నేర్చుకోవాలని..కానీ ఈ క్రమంలో మాతృభాషను మరవొద్దని సూచించారు. ఇంగ్లీష్ రావడం లేదని ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదని, చక్కగా మాతృభాషలో మాట్లాడాలని కోరారు.