పటేల్ లేకుంటే దేశ చిత్రపటం ఇలా ఉండేది కాదు: అమిత్ షా

పటేల్ లేకుంటే దేశ చిత్రపటం ఇలా ఉండేది కాదు: అమిత్ షా

పటేల్ 147వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యుంటే దేశంలో ఈరోజు ఇన్ని సమస్యలు ఉండేవి కావని, ఇది జనం అభిప్రాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత 500పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్లో ఆయన విలీనం చేసి, దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారని షా కొనియాడారు. ఆయనే లేకుంటే దేశ చిత్రపటం ఈరోజు ఉన్నట్లు ఉండేది కాదన్నారు.

లక్షద్వీప్, జోధ్ పూర్, జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ ను భారత యూనియన్ లోకి ఆయన విలీనం చేశారని గుర్తుచేశారు. సోమవారం పటేల్ 147వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి షా మాట్లాడారు. మరణం తర్వాత కూడా గుర్తుండిపోయే మనిషినే సర్దార్ అని పిలుస్తారన్నారు. స్టూడెంట్లు పటేల్ జీవితచరిత్ర చదవాలని సూచించారు.

‘‘సర్దార్ విజనరీ ఉన్న మనిషి మాత్రమే కాదు. తన విజన్ ను సాకారం చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆయన ఓ కర్మయోగి. అమూల్ కోఆపరేటివ్ కు ఆయనే స్ఫూర్తి. సహకార ఉద్యమాన్ని నడిపింది ఆయనే. పటేల్ లేకుంటే ఐక్య భారతం సాకారమయ్యేది కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయనకే అత్యధిక ఓట్లు వచ్చాయి. అయినా ప్రధాని పదవిని ఆయన త్యాగం చేశారు.

సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలకు పునాది వేసింది సర్దారే” అని అమిత్ షా తెలిపారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను మోడీ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందన్నారు. అలాగే దేశ భద్రత మరింత మెరుగైందని, ఇప్పుడు మన సరిహద్దులపై ఎవరూ కన్నేయలేరని చెప్పారు. కాగా పటేల్ జయంతిని ప్రభుత్వం ఏటా రాష్ట్రీయ ఏక్తా దివస్​గా నిర్వహిస్తున్నది.