విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు

విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు

భైంసా/గుడిహత్నూర్/నేరడిగొండ, వెలుగు: రైతులకు అధిక ధరలకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్​ హెచ్చరించారు. గురువారం భైంసాలోని ఏడీఏ ఆఫీస్​లో విత్తన విక్రయదారులతో మీటింగ్​ నిర్వహించారు. వానాకాలం సీజన్​ఆరంభమవుతుండడంతో రైతన్నలకు అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు.

నాణ్యమైన విత్తనాలు అమ్మాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రశీదు ఇచ్చి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. గవర్నమెంట్​ రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టౌన్ సీఐ రాజారెడ్డి, డీఏవో ఆఫీస్​ ఏడీఏ విద్యాసాగర్, భైంసా ఏడీఏ వీణా, ఏవో సోమ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని గుడిహత్నూర్ తహసీల్దార్‌ కవితారెడ్డి, అగ్రికల్చరల్‌ ఏఓ రేవతి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్‌ షాపుల్లో విత్తనాల తనిఖీలు నిర్వహించారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొన్న వెంటనే రైతులు ఫర్టిలైజర్‌ షాపుల నుంచి బిల్లులు తీసుకోవాలన్నారు. విత్తనాలు మొలకెత్తకపోతే ఆ బిల్లుల ద్వారా నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఆయా ఫర్టిలైజర్‌ షాపుల్లో ఎరువులు, విత్తనాల స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు.

రైతులను మోసం చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డీలర్లను హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్​ఐ సయ్యద్‌ ఇమ్రాన్, ఏఈఓలు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని బోథ్ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీధర్ స్వామి హెచ్చరించారు. నేరడిగొండ మండల కేంద్రంలో విత్తన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు, ఎమ్మార్వో సంతోష్ రెడ్డితో కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ధరల పట్టికలను బోర్డులపై రాసి ఉంచాలని వ్యాపారులకు సూచించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ఏఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

రైతులకు రసీదు ఇవ్వాలి

కుంటాల: ఖరీఫ్ లో విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు షాప్ ల నిర్వాహకులు తప్పకుండా రసీదు ఇవ్వాలని టెక్నికల్ ఏడీఏ విద్యాసాగర్, భైంసా ఏడీఏ వీణా ఆదేశించారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేశారు. పత్తి, ఇతర విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదు ఇవ్వాలని, లూజు విత్తనాలు, హెచ్ టీ కాటన్ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఓ సోమలింగారెడ్డి, సిబ్బంది ఉన్నారు.