అమెరికా నుంచి ఇండియన్‌‌ మ్యూజిక్‌‌

అమెరికా నుంచి ఇండియన్‌‌ మ్యూజిక్‌‌

ఆమె పాడితే యువత కేరింతలు కొడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ఆమె పాట అంటే చాలా ఇష్టం. పేరు విద్యా అయ్యర్. తన రంగస్థలం పేరు ‘విద్యా వోక్స్’గానే ఎక్కువమందికి తెలుసు. ఆమె భారతీయ సంతతికి చెందిన అమెరికన్ యూట్యూబర్. ఇప్పటివరకు 30కి పైగా సూపర్ హిట్ మాషప్‌‌లు చేసి ఔరా! అనిపించింది. 

యూట్యూబ్‌‌ స్టార్‌‌‌‌ విద్యా వోక్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆమె చేసిన ‘తమిళ బోర్న్ కిల్లా’, ‘కుత్తు ఫైర్’ లాంటి  హిట్ ఒరిజినల్స్‌‌ చాలా పాపులర్. ఇండో–అమెరికన్‌‌ విద్యా అయ్యర్ తన సిగ్నేచర్ స్టైల్‌‌ను క్రియేట్‌‌ చేసుకోవడానికి ఫారిన్ పాప్ సాంగ్స్‌‌తో బాలీవుడ్‌‌తో పాటు తమిళ, మలయాళ పాటలను మాషప్‌‌ చేసింది. 26 సెప్టెంబర్ 1990న చెన్నైలో పుట్టింది. ఐదేండ్ల వయసు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమెకు ఎనిమిదేండ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే వర్జీనియాలో పెరిగింది విద్య. బయోమెడికల్ సైన్సెస్‌‌లో బీఎస్సీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి సైకాలజీలో మాస్టర్స్​ చేసింది. 2012లో మెడికల్ స్కూల్‌‌లో చేరేందుకు ప్రయత్నించింది. అదే టైంలో  క్లినిక్‌‌లో కూడా పని  చేసింది. కానీ.. కొన్నాళ్లకే తన నిర్ణయం మార్చుకుంది. మ్యూజిక్‌‌ను కెరీర్‌‌‌‌గా మార్చుకుంది. దాంతో ఆమె కర్నాటిక్ క్లాసికల్, వెస్ట్రన్ వోకల్స్‌‌ని నేర్చుకోవడానికి ఇండియా వచ్చింది. ఇక్కడే రెండు సంవత్సరాలు ఉండి డీకే నాగరాజన్ దగ్గర సంగీతం నేర్చుకుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్,  ఫ్రెంచ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది విద్య. 

యూట్యూబ్‌‌ ఛానెల్‌‌

విద్యా వోక్స్ సంగీతం నేర్చుకున్న తర్వాత.. తన టాలెంట్‌‌ని అందరికీ పరిచయం చేయడానికి ‘విద్యా వోక్స్’  పేరుతో యూట్యూబ్ ఛానెల్‌‌ని మొదలుపెట్టింది. అందులో ఎక్కువగా మాషప్స్‌‌ చేస్తోంది. ఈ ఛానెల్‌‌ కోసం ఆమె కంపోజర్‌‌‌‌, అరేంజర్‌‌‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌గా మారింది. శంకర్ టక్కర్ బ్యాండ్‌‌లో కూడా పనిచేస్తోంది. శంకర్‌‌‌‌తో కలిసి ‘శృతిబాక్స్’ అనే సిరీస్‌‌ చేసింది. 2015లో తన మొదటి మ్యూజిక్‌‌ వీడియోను రిలీజ్‌‌ చేసింది. ఆ వీడియో నార్త్ ఇండియాలో బాగా పాపులర్‌‌‌‌ అయింది. ఆ తర్వాత చేసిన వీడియోలకి కూడా రీచ్‌‌ బాగానే వచ్చింది. కొన్ని మాషప్‌‌లను విద్య, శంకర్ ఇద్దరూ కలిసి చేశారు. ఆమె ఛానెల్‌‌కు ప్రస్తుతం ఏడు మిలియన్లకు పైగా సబ్‌‌స్ర్కయిబర్స్‌‌ ఉన్నారు. 

లోకల్‌‌ లాంగ్వేజ్‌‌

మెయిన్‌‌ స్ట్రీమ్‌‌ బాలీవుడ్ సాంగ్స్‌‌తోపాటు ఇంటర్నేషనల్‌‌ చార్ట్‌‌బస్టర్లను కూడా మాషప్‌‌ల కోసం వాడుకుంది. తమిళ, మలయాళ జానపద పాటలను కూడా తీసుకుంది. ఏఆర్‌‌‌‌ రెహమాన్ కంపోజ్‌‌ చేసిన ‘ఓకే కన్మణి’ సినిమాలోని ‘మెంటల్ మనదిల్’ లాంటి పాటను ‘బ్లాంక్ స్పేస్’తో బ్లెండ్‌‌ చేసి హిట్టు కొట్టింది. అంతేకాదు.. ఆమె టాలెంట్‌‌ని షారుక్‌‌ ఖాన్, హృతిక్ రోషన్ కూడా మెచ్చుకున్నారు.  ఆగస్టు 2015లో ‘కమ్ అలైవ్’తో ‘హసీ బాన్ గయే’తో మాషప్‌‌ క్రియేట్‌‌ చేసింది. 2017లో విద్య తన మొదటి ఒరిజినల్ సాంగ్‌‌ ‘కుతు ఫైర్’ని రిలీజ్‌‌ చేసింది. ఈ పాటను మూడున్నర కోట్ల మందికి పైగా చూశారు. 

ఫ్యాన్‌‌ ఫెస్ట్‌‌

2016–-2017లో శంకర్ టక్కర్, జోమీ జార్జ్‌‌లతో కలిసి ‘యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్’, ‘రేడియో మిర్చి లైవ్’ చేసింది. అందుకోసం ఇండియాలోని చాలా సిటీల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 


ఎన్నో దేశాల్లో.. 

శంకర్‌‌ టీంతో కలిసి పనిచేశాక ఆమె దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. వైట్ హౌస్, నేషనల్ సెంటర్ ఫర్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఇండియా), వెబ్‌‌స్టర్ హాల్, రీయూనియన్ ఐలాండ్‌‌లోని ఫెస్టివల్స్ డేస్ ఆర్ట్స్, సురినామ్, దుబాయ్, నెదర్లాండ్స్‌‌లోని మేరు కాన్సర్ట్ సిరీస్‌‌లో ఫర్ఫార్మ్‌‌ చేసింది. 

తండ్రికి దూరంగా.. 

విద్య తల్లిదండ్రుల మధ్య  ఎప్పుడూ గొడవలయ్యేవి. ఆమె తండ్రి, తల్లిని తిడుతూ ఉండేవాడు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏం చేయాలి?.. ఇలా ప్రతి ఒక్కటి ఆయన చెప్పినట్టే నడుచుకోవాలి అనేవాడు. ఇలా చాలా గొడవల తర్వాత ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో విద్య వాళ్ల అమ్మతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె చదువుపై దీని ఎఫెక్ట్‌‌ పడింది. పైగా యూఎస్‌‌లో పెరగడం విద్యకు చాలా కష్టమైంది. తను చదువుకుంటున్న స్కూల్‌‌లో తను, తన చెల్లెలు మాత్రమే బ్రౌన్‌‌ కలర్‌‌‌‌లో ఉండేవాళ్లు. మిగతావాళ్లంతా తెల్లవాళ్లే. దానివల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.  

లాటిన్‌‌ పదం

ఆమె రంగస్థలానికి పెట్టుకున్న పేరులో ‘వోక్స్’ ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. దానికి ‘వాయిస్’ అనే అర్థం వస్తుంది. శంకర్ ఆమె వాయిస్ రికార్డింగ్స్‌‌ని ‘విద్యా వోక్స్’ పేరుతో సేవ్ చేసేవాడు. దాంతో ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌‌కి అదే పేరు పెట్టింది.

మరిన్ని వార్తల కోసం..

ఆసియా రెజ్లింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్ల పట్టు

25 గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్