కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది : రాహుల్​గాంధీ

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది : రాహుల్​గాంధీ

ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణకు మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజాభేరి సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై విమర్శలు చేశారు. ఈ సభలో పీసీసీ చీఫ్​రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా తాను కొల్లాపూర్ సభకు వచ్చానని చెప్పారు రాహుల్. మనది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం అని అన్నారు. కొల్లాపూర్‌ సభకు తప్పక వస్తానని ప్రియాంక హామీ ఇచ్చారని. ఆమె రాలేని పరిస్థితుల్లోనే తాను ఇక్కడి బహిరంగ సభకు వచ్చానన్నారు. టికెట్ల విషయంలో ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నా సభకు హాజరయ్యానని చెప్పారు. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని, దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశాయన్నారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12 వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏడాది కాకుండానే బ్యారేజీలు కూలిపోతున్నాయని రాహుల్​ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో చారిత్రాత్మక సంస్థలను, ప్రాజెక్టులను నెలకొల్పిందన్నారు. 

ధరణి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ధరణి వల్ల కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే లాభం జరిగిందని, దాని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. కేసీఆర్ పరిపాలనలో ప్రభుత్వ సంస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్ర సంపద పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే పోతున్న విషయం ప్రజలందరూ గమనించాలని కోరారు. తెలంగాణ వస్తే మార్పు వస్తుందని ప్రజలందరూ కలలు కన్నారని అన్నారు. 

బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు మధ్య స్పష్టమైన యుద్ధం జరగబోతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని చెప్పారు. అనేక బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి అండగా నిలిచిందన్నారు. భారతదేశంలో విపక్షాలకు చెందిన నాయకులపై సీబీఐ, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే తెలంగాణలో మాత్రం కేసీఆర్ పై ఎలాంటి సీబీఐ, ఈడీ దాడులు జరగడం లేదన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి రానీయకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్ని.. కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు.. ఎంఐఎం పార్టీ లోపాయికారీగా ఆ రెండు పార్టీలతో కలిసి పని చేస్తుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రజాబలం ఉందని, కార్యకర్తలకు నిజాయితీ, నిబద్దత ఉన్నాయని చెప్పారు. అధికార పార్టీ వాళ్లు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారని, కుట్రలు చేస్తారని తనకు తెలుసన్నారు. ప్రజల తెలంగాణ కోసం అందరూ కలిసి కట్టుగా సంఘటితంగా పోరాటం చేయాల్సి అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని చెప్పారు. ప్రజల సొమ్మును ప్రజలకే చెందేలా చూస్తామని హామీ ఇచ్చారు.