హైదరాబాద్: తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆ ఖాతాల ద్వారా నా స్నేహితులకు “నేను ఆపదలో ఉన్నాను, డబ్బులు పంపండి” అంటూ మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారన్నారు. ఒక స్నేహితుడు నిజమని నమ్మి రూ.20 వేలు మోసగాళ్లకు పంపించాడని చెప్పారు. తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే పంపకండని సూచించారు.
మెటా సహకారంతో హైద్రాబాద్ సైబర్ క్రైమ్ టీం తన పేరుతో ఉన్న ఫేక్ ఖాతాలను తొలగించే పనిలో ఉందని తెలిపారు. నా పేరుతో, లేదా ఏ అధికారి/ప్రముఖ వ్యక్తి పేరుతో వచ్చే అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకండని హెచ్చరించారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను అసలు నమ్మకండని సూచించారు.
సందేహాస్పద మెసేజ్ వస్తే వెంటనే ఆ వ్యక్తిని ఫోన్‌లో స్వయంగా సంప్రదించి ధృవీకరించండన్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండని సూచించారు. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని చెప్పారు. జాగ్రత్తగా ఉంటేనే సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా మన డబ్బును, మన సమాచారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
