- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
మాస్కో : గత రెండేండ్లుగా కొనసాగుతున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు షరతులకు అంగీకరిస్తే.. తక్షణం కాల్పుల విరమణకు ఆదేశించి, ఉక్రెయిన్‌తో చర్చలు ప్రారంభిస్తానని పేర్కొన్నారు. శుక్రవారం మాస్కోలోని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలో పుతిన్ మాట్లాడుతూ.. తమ ఆధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన దళాలను ఉపసంహరించుకొని, నాటోలో చేరే ప్రణాళికను విరమించుకుంటే ఆ దేశంతో చర్చలు ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.
తన ప్రతిపాదన ఉక్రెయిన్‌లో సంఘర్షణకు చివరి పరిష్కారంగా భావిస్తున్నట్టు పుతిన్ చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన 7 దేశాల కూటమి జీ 7 సదస్సు ఇటలీలో జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రతిపాదన చేయడం చర్చనీయాంశమైంది. అయితే, దీనిపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాకుండా, ఉక్రెయిన్ సైనిక కూటమిలో చేరాలని కోరుకుంటోంది. అలాగే, రష్యా తమ భూభాగం నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.