కార్యకర్తలను అగ్రనేతలు కలిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు : బీఆర్ఎస్​ క్యాడర్

కార్యకర్తలను అగ్రనేతలు కలిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు : బీఆర్ఎస్​ క్యాడర్
  • కార్యకర్తలను అగ్రనేతలు కలిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారం కోల్పోయిన తర్వాత సమీక్షలు చేయడం.. క్యాడర్​ను అగ్రనేతలు కలవడం మంచిదే.. కానీ ఈ పని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేయాల్సిందని మెజార్టీ బీఆర్ఎస్​కార్యకర్తలు, క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్​ముందు ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి లాభమో అడిగాల్సిందని.. అలా చేసి ఉంటే మూడోసారి బీఆర్ఎస్​గెలిచి.. కేసీఆర్​హ్యాట్రిక్​సీఎం అయి ఉండేవారని చెప్తున్నారు. నాలుగు రోజులుగా తెలంగాణ భవన్​వేదికగా నిర్వహిస్తున్న లోక్​సభ ఎన్నికల సన్నద్ధత సమావేశాల్లో.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కార్యకర్తలు తమ మనసులోని అభిప్రాయాలను ఓపెన్​గానే చెప్తున్నారు. డైరెక్ట్​గా చెప్పడానికి మొహమాట పడుతున్నవారు రాతపూర్వకంగా తమ ఒపీనియన్​ను వ్యక్తం చేస్తున్నారు. రాతపూర్వకంగా అభిప్రాయాలు చెప్పిన కార్యకర్తల్లో కొందరికి మూడు రోజులుగా పార్టీ చీఫ్​కేసీఆర్​ఫోన్​లు చేసి మాట్లాడుతున్నారు. పార్టీకి పూర్వవైభవం తేవడానికి ఏం చేయాలని కేసీఆర్​అడిగితే తమ అభిప్రాయాన్ని పార్టీ నేతలు ఓపెన్​గానే చెప్తున్నారు. తెలంగాణ భవన్​లోనూ కార్యకర్తలు పార్టీ ముఖ్య నేతలకు ఇస్తున్న ఫీడ్​బ్యాక్​దాదాపు ఒకేలా ఉంటున్నది.

పార్టీ కోసం కష్టపడినవారినీ పట్టించుకోలేదు

తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న నాయకత్వం పట్టించుకున్న పాపాన పోలేదని.. తామే హైదరాబాద్​వరకు వచ్చి కలిసేందుకు ప్రయత్నించినా ముఖ్య నేతలు కనీసం అపాయింట్​మెంట్​ఇవ్వలేదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్​ ప్రగతి భవన్​లో ఉండటంతో అక్కడికి వెళ్లే అవకాశం దొరకలేదన్నారు. ఇన్ని రోజులకైనా కార్యకర్తలు గుర్తుకు రావడం మంచిదని, ఇలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచిస్తున్నారు. తెలంగాణ భవన్ ​నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న హరీశ్​రావు సహా మిగతా ముఖ్య నేతలు మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కేసీఆర్ సహా తామంతా క్యాడర్​కు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.