యుద్ధం వస్తే చూస్తూ ఊరుకోం: ఇమ్రాన్​ ఖాన్

యుద్ధం వస్తే చూస్తూ ఊరుకోం: ఇమ్రాన్​ ఖాన్

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఇండియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్​లో 55 రోజులుగా ‘అమానవీయ కర్ఫ్యూ’  కొనసాగుతోందని, కర్ఫ్యూను ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమేనని వ్యాఖ్యానించారు.  ఒక వేళ యుద్ధమంటూ వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, చివరి వరకు పోరాడుతామని తెలిపారు. తాము బెదిరించడం లేదని, తమ ఆందోళన మాత్రమే చెబుతున్నామన్నారు. ఐరాస జనరల్​ అసెంబ్లీ 74వ సెషన్​లో ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత ఇమ్రాన్​ ఖాన్​ సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకు ముందు మీడియాతో కూడా మాట్లాడారు. ఇండియాను టార్గెట్​ చేస్తూ పాక్​ ప్రధాని ప్రసంగం కొనసాగింది. న్యూక్లియర్​ ఆయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదని, ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఐరాసపై ఉందని అన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ఫోబియా పెరుగుతోందని,  9/11 తర్వాత ఇది మరింత పెరిగిందని, హిజబ్​ ధరించినా కూడా ఆయుధంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు లీడర్లు టెర్రరిజాన్ని ఇస్లాం మతంతో ముడిపెట్టారని, మతానికి టెర్రరిజానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ముస్లింలను టెర్రరిస్టులుగా, ఆత్మాహుతి దళ సభ్యులుగా ముద్రవేశాయి.  అయితే.. 9/11 దాడులకు ముందు ఆత్మాహుతి దాడులు చేసేవారు తమిళ హిందువులే. అప్పట్లో హిందువులపై ఎవరూ టెర్రరిజం ముద్ర వేయలేదు.  9/11 దాడులతో మా వాళ్లకు సంబంధం లేకున్నా 70 వేల మంది పాకిస్థానీయులు చనిపోవాల్సి వచ్చింది” అని అన్నారు.

సర్జికల్​ స్ట్రయిక్​కు కొన్ని చెట్లు కూలిపోయాయి

కాశ్మీర్​ విషయంలో చర్చలు జరుపుదామంటే ఇండియా ప్రధాని మోడీ ముందుకు రావడం లేదని ఇమ్రాన్​ ఖాన్​ ఆక్షేపించారు.  సర్జికల్​ స్ట్రయిక్​తో 300 మందిని చంపినట్లు మోడీ చెప్తున్నారని, అయితే.. దాని వల్ల కొన్ని చెట్లు మాత్రమే కూలిపోయాయని, వాటిని తాము తిరిగి పెంచుతున్నామని  ఆయన ఎద్దేవా చేశారు. మొన్న ఎన్నికల తర్వాత ఇండియాలో పరిస్థితి మారుతుందని తాము ఆశించామని, కానీ.. అందుకు భిన్నంగా జరుగుతోందని, కాశ్మీర్​లో ఆర్టికల్​ 370ని రద్దు చేశారని, అక్కడ అమానవీయ కర్ఫ్యూ కొనసాగుతోందని అన్నారు.  భారీ స్థాయిలో బలగాలను మోహరించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఆరెస్సెస్​ నుంచి వచ్చారని, ముస్లింలు, క్రిస్టియన్లు అంటే ఆరెస్సెస్​కు ద్వేషమని పాక్​ ప్రధాని అన్నారు.  ‘‘55 రోజులుగా కాశ్మీర్​లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 80 లక్షల మంది బంధీలుగా ఉన్నారు. కర్ఫ్యూను ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమే. ఇన్నాళ్లూ బంధించాక యువత తుపాకీ పట్టకుండా ఏం చేస్తుంది. వెంటనే కర్ఫ్యూను ఎత్తివేయాలి. అక్కడి రాజకీయ బంధీలను విడుదల చేయాలి” అని డిమాండ్​ చేశారు. మరో దాడి జరిగితే మళ్లీ తమనే ఇండియా నిందిస్తుందని ఆరోపించారు. ‘‘బాలాకోట్‌లో 500 మంది టెర్రరిస్టులు రెడీగా ఉన్నారని ఇండియా చెబుతోంది. టెర్రరిస్టులను పంపి మేమే చేస్తాం. ఆ అవసరం మాకేంటి. అసలు మా దేశంలో టెర్రరిజం సంస్థలే లేవు. కావాలంటే ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వచ్చి చూసుకోవచ్చు” అని అన్నారు.