ఏమీ లేకున్నా.. అఫిలియేషన్ ఇస్తున్రు

ఏమీ లేకున్నా.. అఫిలియేషన్ ఇస్తున్రు

ఏటా రూల్స్ తప్పుతున్న కాలేజీలు
మే నెలాఖరుకు అఫిలియేషన్లు పూర్తి
ఉమర్​ జలీల్, ఇంటర్​ బోర్డు సెక్రటరీ
నోటీసులతోనే సరిపెడుతున్న ఇంటర్ బోర్డ్   
ఫైర్ ​ఎన్వోసీ లేని 83 ప్రైవేట్​ కాలేజీలు
చర్యలకు వెనకాడుతున్న బోర్డు 

ఈ ఏడాది జూనియర్​ కాలేజీల అఫిలియేషన్లపై సీరియస్​గా ఉన్నాం. గుర్తింపు ప్రక్రియను త్వరలోనే ప్రారంభించి, మే ఆఖరుకు పూర్తి చేస్తం. వచ్చే ఏడాదికి సంబంధించి ఏ కాలేజీకి  గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి స్టూడెంట్స్​ఎవ్వరూ కాలేజీల్లో చేరొద్దు. ఫైర్​ ఎన్వోసీ లేని కాలేజీలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై గురువారం మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

హైదరాబాద్, వెలుగురూల్స్​ను పాటించని ప్రైవేట్, కార్పొరేట్​ జూనియర్​ కాలేజీలపై ఇంటర్​ బోర్డు చర్యలకు వెనకాడుతోంది. ఏటా అకడమిక్​ ఇయర్​ మొదట్లో నోటీసులు ఇవ్వడం, కాలేజీలు తీరు మార్చుకోకపోతే స్టూడెంట్స్​కు కండిషనల్​ లాగిన్స్​ ఇవ్వడం పరిపాటి అయింది. నాలుగైదేండ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకవడంపైనా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్నీ ఆ కాలేజీలే..

రాష్ర్టంలో ఈ విద్యాసంవత్సరం 2,786 జూనియర్​ కాలేజీలు రిజిస్టర్​ చేసుకున్నాయి. వీటిలో 2,570 కాలేజీలకు ఇంటర్​ బోర్డు అఫిలియేషన్​ ఇచ్చింది. వీటిలో ప్రైవేటు జూనియర్​ కాలేజీలు1,701 రిజిస్టర్​ చేసుకుంటే, 1,486 కాలేజీలకు గుర్తింపు ఉంది. మరో 215 కాలేజీలకు గుర్తింపులేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైర్​ఎన్వోసీ లేని కాలేజీలకు గుర్తింపు ఇవ్వొద్దని విద్యాశాఖకు గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటిని పట్టించుకోకుండా నాలుగేండ్లుగా బోర్డు అనుమతులిస్తూ పోతోంది. ఈ ఏడాదీ ఫైర్​ఎన్వోసీ లేకుండా 83 కాలేజీలు కొనసాగుతున్నాయి. ఆ కాలేజీలన్నీ శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి, ఎన్ఆర్ఐ మేనేజ్​మెంట్లవే కావడం గమనార్హం. పరీక్షల టైం కావడంతో ఈ ఏడాదీ ఆయా కాలేజీల స్టూడెంట్స్​కు కండిషన్​ లాగిన్​ ఇస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నట్టు బోర్డు అధికారులు ప్రకటించారు. గుర్తింపులేని శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో అడ్మిషన్లపై రెండు రోజుల క్రితం హైకోర్టు సీరియస్​ కావడంతో అఫిలియేషన్ల విషయం మరోసారి తెరమీదకు వచ్చింది.

కాలేజీలు స్టార్ట్​ అయ్యాకే

జూన్1న నాటికి కాలేజీలకు అఫిలియేషన్​ ఇవ్వాలి. గుర్తింపులేని కాలేజీల లిస్టు ప్రకటించాలి. కానీ వాటిని ఇంటర్​ బోర్డు అధికారులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి 348  ప్రైవేటు కాలేజీలకే షరతులతో కూడిన పర్మిషన్​ ఇచ్చారు. డిసెంబర్​ వరకూ ఈ అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం 1,486 కాలేజీలకు అఫిలియేషన్​ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఫైర్​ఎన్వోసీ లేకపోవడంతో 83 కాలేజీలకు మాత్రం ఇవ్వలేదంటున్నారు. వీటిలో గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే సుమారు70 వరకూ ఉన్నాయి. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ కొన్ని ఉన్నాయి. అయితే లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్లు, శానిటేషన్​ సర్టిఫికెట్​, ల్యాండ్​ పత్రాలు లేని కాలేజీలకూ ఈ సారి అధికారులు అనుమతులిచ్చారు.