ఓడిపోతే కేసీఆర్​ రాజీనామా చేస్తరా

ఓడిపోతే కేసీఆర్​ రాజీనామా చేస్తరా

హుజూరాబాద్​ టౌన్​, వెలుగు: హుజూరాబాద్ లో టీఆర్ఎస్  గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని,  ఓడిపోతే సీఎం కేసీఆర్​ రాజీనామా చేస్తారా.. అని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ సవాల్​ విసిరారు. హుజూరాబాద్​ మండలం సిర్సపల్లిలో తుదిదశ నిర్మాణ పనుల్లో ఉన్న డబుల్​బెడ్రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్దే చేయలేదని తనను విమర్శిస్తున్న నాయకులు వాళ్ల దగ్గర ఎన్ని ఇండ్లు కట్టారని  ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ తీరు మోచేతికి బెల్లంపెట్టి అరచేతిని నాకించే విధంగా ఉంటది. ఎన్నికల సమయంలో డబుల్​ బెడ్రూం ఇండ్ల గురించి చాలా గొప్పగా అనేక ముచ్చట్లు చెప్పిండు.  కేంద్రం నిధులు కూడా వాడుకోకుండా గుడిసెలు లేని గ్రామాలు చేస్తానని, అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఇన్నేండ్లయితున్నా ఎన్ని కట్టించారో చెప్పాలి? ”అని డిమాండ్​ చేశారు. వరంగల్ లో జర్నలిస్టులకు ప్రపంచ స్థాయిలో ఇండ్లు కట్టిస్తానన్న కేసీఆర్ కట్టించారా అని ఆయన నిలదీశారు. కేసీఆర్​ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, వాసాలమర్రిలో దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున  ఇస్తానని చెప్పి ఇచ్చారా?  అని ప్రశ్నించారు. ‘‘మాటలు కోటలు దాటుతయ్​ తప్ప..  కాళ్లు మాత్రం గడప దాటవు.  ఇలాంటి దరిద్రపు, నికృష్టపు పాలన  ఇంకా ఎన్నాళ్లో సాగదు” అని అన్నారు. 

ఓట్ల కోసమే ఈటలపై ఆరోపణలు: వివేక్​
కేవలం ఓట్ల కోసమే ఈటల రాజేందర్​పై టీఆర్​ఎస్​ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి అన్నారు. గురువారం ఈటలతో కలిసి సిర్సపల్లిలో డబుల్​ బెడ్రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ..  ఈటల  నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు మంజూరైతే 2 వేలు ఇండ్లు కట్టించారని, తాను కూడా ఈ ఇండ్లు చూశానని చెప్పారు. వేరే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టలేదన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో  200 ఇండ్లు మాత్రమే కట్టించారని, కానీ అక్కడి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇక్కడికొచ్చి హుజూరాబాద్ లో ఈటల ఇండ్లు కట్టించలేదని ఓట్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా బిల్లులు రావడం లేదని అన్నట్లు ఆయన గుర్తు చేశారు.  ప్రభుత్వం కేంద్రం నుంచి 2 లక్షల ఇండ్లకు వచ్చిన నిధులు సరిగా వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.