మేం పగబడితే.. సగం మంది కాంగ్రెస్​ లీడర్లు జైల్లో ఉండేటోళ్లు : హరీశ్​

మేం పగబడితే.. సగం మంది కాంగ్రెస్​ లీడర్లు జైల్లో ఉండేటోళ్లు : హరీశ్​
  • హౌసింగ్​ స్కామ్​ రిపోర్ట్​ చేతిలో ఉన్నా ఎవరిపైనా చర్యలు తీసుకోలే: హరీశ్​
  • పగ, ప్రతీకారాలకన్నా ప్రజాక్షేమమే ముఖ్యమనుకున్నామని కామెంట్

నర్సాపూర్, వెలుగు: పనితనం తప్ప.. పగతనం తెలియని నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్​ రావు​ అన్నారు. కాంగ్రెస్ నేతల హౌసింగ్ స్కామ్​ మీద రిపోర్ట్ వస్తే  ప్రజా సంక్షేమం కోసం పగ, ప్రతీకారాలు పక్కనపెట్టామని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ‘‘మేము అరెస్టులు చేసి ఉంటే.. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో సగం మంది జైల్లో ఉండేవారని, కానీ మేము అలా చేయలేదు”అని హరీశ్​అన్నారు. బుధవారం మెదక్​ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో హరీశ్​రావు పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేసి గెలిచారన్నారు.  మనం చేసిన కృషి నిలకడ మీద తెలుస్తుందని, నాలుగు రోజులైతే పాలేందో, నీళ్లేందో ప్రజలకు అర్థమవుతుందన్నారు. పార్టీ కార్యకర్తలందరూ కష్టపడడం వల్లే  నర్సాపూర్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టిందని అభినందించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కష్టపడిన వారిని గుర్తు పెట్టుకుంటామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటామని హరీశ్​ హామీ ఇచ్చారు.

పార్లమెంట్ ఘటన బాధాకరం

పార్లమెంట్ లో జరిగిన ఘటన బాధాకరమని హరీశ్ రావు అన్నారు. జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, నాయకులు వంటేరు ప్రతాపరెడ్డి, చంద్ర గౌడ్, మన్సూర్ అలీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.

ఓటమి స్పీడ్ ​బ్రేకర్​ మాత్రమే..

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, అంతిమంగా గమ్యం చేరేది మన బీఆర్ఎస్ పార్టీనే అని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. అధికార పక్షం మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుందని, కానీ మనం దేనికీ బయపడొద్దన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అండగా ఉంటారని, అవసరమై ఫోన్ చేస్తే గట్టిగా గంటలో తాను కూడా అందుబాటులోకి వస్తానన్నారు. ‘గెలుపోటములు సహజం, ఒలికిపోయిన పాల గురించి ఆలోచన వద్దు.. భవిష్యత్తులో సాధించే విజయం గురించి ఆలోచిద్దాం’ అని  పార్టీ శ్రేణులకు హరీశ్​ సూచించారు. అందరం కలిసి శ్రమించి, రానున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం పనిచేద్దామన్నారు. అధికార పక్షం అయినా, ప్రతి పక్షం అయినా మనం  ప్రజల పక్షంగానే ఉందామన్నారు.