మారుపాక అనే గ్రామంలో మల్లేశం అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి నాలుగు పాలిచ్చే బర్రెలు ఉండేవి. మల్లేశం సోమరిపోతు. వాటి ఆలనా పాలనా చూసుకునేవాడు కాదు. ఆయన భార్య మహేశ్వరి మాత్రం తెలిసిన రైతుల పొలాల నుంచి గడ్డి తెచ్చి బర్రెలకు వేసేది. వాటి పాలు పిండి చుట్టుపక్కల వాళ్లకి అమ్మేది. పాలు అమ్మితే వచ్చిన డబ్బులతోనే సంసారం గడిచేది. మల్లేశం మాత్రం ఏ పనీ చేయకుండా కనిపించిన వారితో కబుర్లు చెబుతూ చిన్నప్పుడు మా తాత నన్ను అదృష్ట జాతకుడనే వాడని, కాలం కలిసి వస్తే ఎప్పటికైనా నేను ధనవంతుడిని అవుతానని, అందుకే నేను ఏ పనీ చేయడం లేదని గొప్పలు చెబుతూ కాలం గడిపేవాడు.
ఒకనాడు మల్లేశం ఇంటికి చిన్ననాటి మిత్రుడు అభిరామయ్య వచ్చాడు. అతనితో తన అదృష్ట జాతకం గురించి తెలిపాడు. ‘‘నీ గురించి ఒక ఋషిని సంప్రదించాను. నీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందట. మన ఊరి సమీపంలో ఉన్న అడవికి కోరికలు తీర్చేటి కామధేనువు రాబోతుందట. అది వచ్చిన సమయంలో బర్రెలతో కనిపించిన వ్యక్తికి వరాలిస్తుందట. నీలాంటి అదృష్ట జాతకులకు అది కనిపిస్తుందట. ఈ సంగతి ఎవరితో చెప్పొద్దు’’ అని మిత్రుడు అభిరామయ్య చెప్పాడు.
మల్లేశం పట్టరాని సంతోషంతో మిత్రుడిని కౌగిలించుకున్నాడు. ఇక మరుసటి రోజు నుంచి తన బర్లను మేపేటందుకు అడవికి తోలుకొనిపోవడం ప్రారంభించాడు. కామధేనువు కనిపిస్తే కావాల్సినంత ధనం కోరుకుంటానని అనుకున్నాడు. క్రమం తప్పకుండా ప్రతిరోజు అడవికి తన నాలుగు బర్లను తోలుకొని వెళ్తుండేవాడు. ఆ బర్రెలు కడుపునిండా మేత మేయసాగాయి.
మునుపటి కంటే పాలు ఎక్కువ ఇవ్వడం మొదలుపెట్టాయి. దాంతో ఇంటి ఆదాయం కూడా పెరిగింది. ఆ ఇంటి చుట్టుపక్కలవారు కూడా వారి వారి బర్లను మల్లేశానికి అప్పగించారు. అందుకు వారు కొంత ధనం అతడికి ఇచ్చేవారు. పైగా మల్లేశం అడవిలో వాటిని మేపుకుంటూ అప్పుడప్పుడు చింతపండు, కుంకుడు కాయలు, సీతాఫలాలు వంటి వాటిని తెచ్చేవాడు. ఇవి కూడా మల్లేశానికి మరింత ఆదాయాన్ని సమకూర్చాయి.
కొంతకాలానికే అతడి ఇల్లు ధన ధాన్యాలతో కళకళలాడసాగింది. ఒక పండుగ రోజున అభిరామయ్య మల్లేశం ఇంటికి వచ్చాడు. పట్టరాని ఆనందంతో మల్లేశం తన మిత్రుడిని కౌగిలించుకుని” నాకు కామధేనువు కనిపించలేదు కానీ, నా ఆదాయం బాగా పెరిగింది. నాకు ఏ బాధ లేదు. పాడి పశువులను కడుపునిండా మేపుతున్నందుకు సంతృప్తిగా ఉంది. నాకు మంచి సలహా చెప్పి మేలు చేశావు. కామధేనువు కనిపిస్తే ఏమి కోరుకోవాలనుకున్నానో అది నెరవేరింది. మా తాత చెప్పిన అదృష్ట జాతకం అంటే ఇదేనేమో’’ అని మిత్రుడితో చెప్పాడు. అప్పుడు మిత్రుడు అభిరామయ్య ‘‘నీకు ఇలాంటి మేలు జరగాలనే ఋషి, కామధేనువు అని అబద్ధం చెప్పాను’’ అని అన్నాడు. చివరాఖరికి మంచి సలహా ఇచ్చిన అభిరామయ్య, అది పాటించిన మల్లేశం ఇద్దరూ ఆనందపడ్డారు.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి-
