డయాబెటిస్ ఉన్నా, లేకున్నా.. ఇవి తింటే నో ప్రాబ్లెమ్

డయాబెటిస్ ఉన్నా, లేకున్నా.. ఇవి తింటే నో ప్రాబ్లెమ్

జాక్​ ఫ్రూట్ రోటీ

కావాల్సినవి :  జాక్​ ఫ్రూట్​ ఫ్లోర్ – అర కప్పు, గోధుమ పిండి – అర కప్పు
ఉప్పు లేదా పింక్ హిమాలయ ఉప్పు– ముప్పావు టీస్పూన్
నీళ్లు – సరిపడా

తయారీ : ఒక గిన్నెలో జాక్​ఫ్రూట్​ ఫ్లోర్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), గోధుమ పిండి, ఉప్పు వేసి కలపాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కలిపి, ముద్దగా చేయాలి. దానిపై క్లాత్​ కప్పి ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత పిండిని బాగా పిసికి, ఉండలు చేయాలి. చపాతీల్లా వత్తి, పెనం పై కాల్చాలి.

డయాబెటిస్​ వచ్చిందంటే నచ్చినవేవీ తినలేం అని వాపోతుంటారు చాలామంది. ఒకవేళ తినాలనిపిస్తే హెల్త్​ కోసం రుచిని, రుచి కోసం హెల్త్​ని త్యాగం చేయాల్సి వస్తుంది అనేది వాళ్ల కంప్లైంట్​. కానీ, రుచిగా, హెల్దీగా ఉండే ఈ రెసిపీలు తింటే డయాబెటిస్​ ఉన్నా లేకున్నా నో ప్రాబ్లమ్​. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు రుచిగా తినాలనుకుంటే ఇవి ట్రై చేయండి.

కీరదోస పొంగనాలు

కావాల్సినవి : జొన్న పిండి,
కీర దోస ముక్కలు – ఒక్కో కప్పు చొప్పున
పచ్చిమిర్చి – మూడు, అల్లం – కొంచెం
జీలకర్ర, వాము, బేకింగ్ పౌడర్ – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున, పెరుగు, కసూరీ మేథీ, ఉల్లిగడ్డ, క్యారెట్ తరుగు, నీళ్లు – ఒక్కోటి అర కప్పు చొప్పున, ఉప్పు, నూనె – సరిపడా
పసుపు, కారం – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున

తయారీ : మిక్సీజార్​లో కీరదోస ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో జొన్న పిండి, కీరదోస మిశ్రమం వేసి కలపాలి. అందులో పెరుగు, వాము, ఉప్పు వేసి, నీళ్లు పోసి కలపాలి. గిన్నెపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పసుపు, కసూరీ మేథీ, ఉల్లిగడ్డ, క్యారెట్ తరుగు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అందులో బేకింగ్ పౌడర్, కొంచెం నీళ్లు వేసి కలపాలి. పొంగనాల పెనం వేడి చేసి, నూనె పూసి, పిండితో పొంగనాలు పోయాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత మూత తీసి మరో వైపు తిప్పి మళ్లీ కాసేపు ఉడికించాలి.

పనీర్ ఇడ్లీ

కావాల్సినవి : పనీర్ – అర కప్పు
పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు
సీలియం హస్క్ పౌడర్ లేదా ఈసబ్​ గోల్ – అర టీస్పూన్
జీలకర్ర పొడి, వాము, ఆలివ్ ఆయిల్, బేకింగ్ పౌడర్ – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
ఉప్పు – సరిపడా

తయారీ : మిక్సీ జార్​లో పనీర్, పెరుగు, సీలియం హస్క్ పౌడర్, జీలకర్ర పొడి, వాము, ఆలివ్ ఆయిల్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ ప్లేట్​లో వేయాలి. పాత్రలో నీళ్లు పోసి, వేడయ్యాక ఇడ్లీల ప్లేట్​ పెట్టి మూత పెట్టి ఉడికించాలి.   

రాగి – మునగాకుతో

కావాల్సినవి : చిన్న ఉల్లిగడ్డలు– ఐదు, పచ్చిమిర్చి – ఒకటి, మునగాకు – పావు కప్పు, కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – అర టీస్పూన్, రాగిపిండి – ఒక కప్పు, వేడి నీళ్లు – ఒకటింబావు కప్పు

తయారీ : ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, మునగాకు, కొబ్బరి పొడి, ఉప్పు, రాగి పిండి వేసి వేడి నీళ్లు పోసి కలపాలి. ఆ వేడి మీదే ముద్ద చేసి, రొట్టెలా చేత్తో వత్తాలి. దాన్ని పెనం మీద వేసి రెండు వైపులా కాల్చాలి.   

రాగి ఉప్మా

కావాల్సినవి : రాగి పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, పసుపు, జీలకర్ర – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున, నల్ల మిరియాల పొడి, మెంతులు – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, చిన్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి – ఒక్కోటి చొప్పున,  ఎండు మిర్చి – రెండు,  నూనె – ఒక టీస్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్

తయారీ : ఒక పాన్​లో రాగి పిండి వేసి వేగించాలి. అందులో నీళ్లు పోసి, ఉప్పు, కొబ్బరి, జీలకర్ర, పసుపు, మిరియాల పొడి ఒక్కోటిగా వేస్తూ కలపాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి ముక్కలు, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. ఆ తాలింపును రాగి పిండి మిశ్రమంలో కలిపితే రాగి ఉప్మా రెడీ.

ఇన్​స్టంట్ బ్రేక్​ఫాస్ట్

కావాల్సినవి : పెసరపప్పు – ముప్పావు కప్పు
బ్రౌన్ రైస్ – అర కప్పు
మినపప్పు – మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు – సరిపడా
ఎండు మిర్చి – ఒకటి
సోంఫు, జీలకర్ర – అర టీస్పూన్
అల్లం – చిన్న ముక్క
కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు
నువ్వులు – ఒక టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో పెసరపప్పు, మినపప్పు, బ్రౌన్ రైస్ వేసి నీళ్లు పోసి మూడుగంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీజార్​లో వీటితోపాటు ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో మిక్సీజార్​లో ఎండు మిర్చి, అల్లం, సోంపు, కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని పిండిలో వేసి కలపాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. పాన్​కేక్​ వేసే పాన్​​లో నూనె, నువ్వులు వేసి పిండి మిశ్రమాన్ని పోయాలి. తర్వాత వాటిని రెండు వైపులా కాల్చాలి.