
- కంపెనీలకు మంత్రి గడ్కరీ సూచన
న్యూఢిల్లీ: పాత వాహనాన్ని తుక్కుగా మార్చిన వాళ్లు కొత్తది కొంటే అదనపు రాయితీ ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమను కోరారు. పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త వాహనం కొనేవారికి జీఎస్టీ రాయితీ ఇవ్వాలని ప్రధానినీ, ఆర్థిక మంత్రినీ కోరినట్లు కూడా చెప్పారు.
వాహన స్క్రాపేజ్ విధానం అటు పరిశ్రమకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు. పాత వాహనాలను తుక్కుగా మార్చడం వల్ల రూ. 40వేల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తుందని తెలిపారు. స్క్రాప్ ద్వారా స్టీల్, లెడ్, అల్యూమినియం, ప్లాటినం, పల్లాడియం వంటి లోహాలను కూడా పొందవచ్చని గడ్కరీ వివరించారు.