కాంగ్రెస్​కు ఓటేస్తే.. కష్టాలు గ్యారంటీ : కేటీఆర్

కాంగ్రెస్​కు ఓటేస్తే.. కష్టాలు గ్యారంటీ : కేటీఆర్
  • ఆరు గ్యారంటీల అమలు అసాధ్యం: కేటీఆర్
  • ప్రజలను ఆ పార్టీ మభ్యపెడుతున్నది
  • బీజేపీ మతం పేరుతో చిచ్చుపెడుతున్నది
  • ‘రజాకార్’ అంటూ చిల్లరమల్లర సినిమాలు తీస్తున్నదని ఫైర్
  • బీఆర్ఎస్​లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్​కు ఓటేస్తే కష్టాలు గ్యారంటీ అని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల మొత్తం రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఫైర్ అయ్యారు. డబ్బు సంచులతో దొరికినోళ్లను పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలే వస్తాయని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్​లో భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ మాజీ అధ్యక్షుడు కోనేరు చిన్ని సహా పలువురు బీజేపీ నాయకులు, మంథని సెగ్మెంట్​కు చెందిన పలువురు కాంగ్రెస్​ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల గురించి కేటీఆర్​ఓ పిట్టకథ చెప్పారు. ‘‘కిందపడిపోయిన 5 పైసల సూది దొరికితే ఒక ముసలామే వెయ్యి కొబ్బరి కాయలు కొడుతానని, 5 కిలోల బెల్లం ఇస్తామని భద్రాద్రి రాములోరికి మొక్కకున్నదట. ఆమె కోడలు వచ్చి 5 పైసల సూది కోసం ఇన్ని ఇస్తామని మొక్కుతావా? అని అడిగితే.. ‘ముందు సూదైతే దొరుకనియ్యి.. దేవుడచ్చి అడిగేది ఉందా.. సచ్చేది ఉందా’ అన్నదట. కాంగ్రెస్సోళ్ల కథ కూడా అట్లనే ఉన్నది. అమలు సాధ్యం కాని గ్యారంటీలు ఇచ్చారు” అని విమర్శించారు. ‘‘అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. కాంగ్రెస్​కు ఓటేస్తే మళ్లీ కరెంట్​ కష్టాలు గ్యారంటీ. ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలు, వీధి కుళాయిల దగ్గర పోరాటాలు గ్యారంటీ. రైతన్నలు ఎరువులు, విత్తనాల కోసం పోలీస్​స్టేషన్ల ముంగట నిలబడటం​ గ్యారంటీ. మళ్లీ తన్నుకోవడం, సావడం కూడా గ్యారంటీ. రైతుబంధు, దళితబంధు.. రెండింటినీ ఎత్తగొట్టడం గ్యారంటీ. కాంగ్రెస్​అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక్క ముఖ్యమంత్రి మారడం కూడా గ్యారంటీ” అని అన్నారు.

55 ఏండ్లు చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా?

సోనియా, రాహుల్​ ఒక్క చాన్స్ ​ఇవ్వమని అడుగుతున్నారని, 55 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనోళ్లకు ఒక్క చాన్స్ ఇస్తే ఏం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘దేశ, రాష్ట్ర ప్రజలు 11 చాన్స్​లు ఇస్తే కరెంట్​ఇవ్వలేదు.  అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ​ఇవ్వనోళ్లు.. అధికారం కోసం రూ.4 వేలు ఇస్తామని మభ్యపెడుతున్నారు. కర్నాటకలోనూ ఇట్లాంటి మాయమాటలే చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అక్కడ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేక కరెంట్​చార్జీలు పెంచారు.  అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమారే స్వయంగా చెప్పారు” అని పేర్కొన్నారు. ‘‘ఓటుకు 2, 3 వేలు ఇస్తే గెలిసిపోతామని కాంగ్రెస్సోళ్లు చెప్తున్నరట.

Also Raed : ఖమ్మంలో డెంగీ కలవరం!..గడిచిన19 రోజుల్లో150 మందికి పాజిటివ్

కాంగ్రెస్సోళ్ల దగ్గర ఏ నుంచి జెడ్​ దాకా చేసిన స్కాముల్లో దొబ్బితిన్న సొమ్ము బాగా ఉంది. వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి” అని పిలుపునిచ్చారు. ‘‘వాళ్లు డబ్బులున్నయని బాగా బలిసి కొట్టుకుంటున్నరు.. నేను ఈ మాట అన్నందుకు నా మీద కేసు పెడుతరేమో..” అని కామెంట్ చేశారు.

సినిమాలు తీసుడు తప్ప.. బీజేపీ ఏం చేసింది?

మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్ చూస్తే, మతం పేరుతో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘సెప్టెంబర్​17 పేరుతో రాజకీయం చేస్తున్నరు. అప్పటి పాత గాయాలు 75 ఏండ్ల తర్వాత మానుతుంటే.. పురుగు గెలికినట్టు గెలకాలని ‘రజాకార్​ఫైల్స్’ పేరుతో ఏదో చిల్లరమల్లర సినిమా తీస్తున్నరు. బీజేపీ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి దానికి డబ్బులు పెట్టిండు. ఆ సినిమాలో హిందువులు, ముస్లింలు సంపుకునేది సూపెట్టి అప్పటి గాయాలను గెలికి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. ప్రధాని అనేవాడు నికృష్టమైన పనులు చేయవచ్చా. అంతగొప్ప పదవి ఇచ్చిన తర్వాత ఇంత దిగజారి పని చేయొచ్చా. ఒకవైపు కశ్మీర్​ఫైల్స్.. ఇంకోవైపు కేరళ స్టోరీ.. రజాకార్​ఫైల్స్.. ఇవి తప్ప తొమ్మిదేండ్లలో చేసిందేమీ లేదు. చేతగానోళ్లు మాత్రమే ఇలా భావోద్వేగాలతో ఆడుకుంటూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తరు” అని విమర్శించారు. ‘‘యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి పతనం గురించి మోదీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు పాతాళానికి చేరింది. దీనికి ఎందుకు జవాబు చెప్పడం లేదు. ధరలు పెరుగుతున్నయ్, మణిపూర్ మండుతున్నదని ప్రశ్నిస్తే మాట్లాడడం లేదు. కానీ ఎంతసేపు మతం పేరు చెపి, చిల్లర రాజకీయం చేస్తున్నారు” మండిపడ్డారు.

మోదీ.. ఒక్క హామీ నెరవేర్చలే..

మోదీ ఎన్నో హామీలిచ్చి, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించా రు. ‘‘2022 నాటికి బుల్లెట్​రైలు వస్తుంది. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తం. దేశ ఎకానమీ ఐదు ట్రిలియన్​డాలర్లకు చేరుతుంది. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తామని చెప్పారు. వీటిలో ఒక్కటైనా చేశారా” అని ప్రశ్నించారు. నిరుద్యో గం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడితే జవాబు చెప్పే దమ్ములేదు గానీ, నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డా రు. మోదీ ప్రభుత్వం విభజన చట్టంలోని ఒక్క హామీని అమలు చేయలేదు గానీ, ఆ పార్టీ లీడర్లు ఇక్కడికి వచ్చి డైలాగులు కొట్టి
పోతున్నారని విమర్శించారు. కిషన్​రెడ్డికి దమ్ముంటే విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్​ విసిరారు. మోదీ తెలంగాణ ఆవిర్భావాన్నే కించ పరిచేలా మాట్లాడుతున్నారని, పార్లమెంట్​సాక్షిగానూ అలాంటి వ్యాఖ్యలే చేశారని ఫైర్ అయ్యారు.