
అవినీతి విస్తృతమై కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే, గొలుసుకట్టు అవినీతి గురించి ప్రజలకు క్రమంగా అర్థం అవుతోంది. అధికారులలో సిండికెటేడ్ వ్యవహారం ఒక మాఫియా మాదిరిగా వేళ్లూనుకున్నది. ధరణిలో, సాగునీటి ప్రాజెక్టులలో, ధాన్యం కొనుగోళ్లలో ఈ తరహా అవినీతి, లంచగొండితనం వ్యవహారికమైంది. అవినీతి వలన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం నాణ్యతలో లోపాలు ఉంటాయని అనుకుంటాం. ఇప్పుడు ప్రాజెక్టు బడ్జెట్ అవసరమైన దాని కంటే పదింతలు పెంచి అనవసరంగా ప్రజాధనం బొక్కుతున్నా ప్రాజెక్టుల నాణ్యత ఇంకా దిగజారింది.
రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు,భవనాలు,ఆనకట్టలు కట్టిన కొద్దికాలానికే పగుళ్లు, లీకులు ఏర్పడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతరుల ధన దాహానికి అంతులేకుండాపోతోంది. అవినీతిలో అనేక కోణాలు ఉన్నాయి.
ప్రజలను ఈ మధ్య గందరగోళానికి గురి చేస్తున్న పరిణామం అధికారులు తమ పని సక్రమంగా చేయకపోవడం. ప్రజలు తమ సమస్య తీర్చమంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండిపోతున్నారు. అనేక విషయాలలో సామాన్యుల సమస్యలు తీర్చడంలో అధికారులు మౌనంగా ఉంటే ప్రజలకు ఏం చేయాలో, తమ సమస్యకు పరిష్కారం ఎట్లనో తోస్తలేదు.
గత పదేండ్లకు పైగా అధికారులు ప్రతి సమస్యకు తాము పని చేయకుండా, పరిష్కారం చూపకుండా కోర్టుకు వెళ్ళమని సూచిస్తున్నారు. పాలనపరంగా, చట్టాలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన సమస్యలకు కూడా కోర్టుకు వెళ్ళాల్సి వస్తోంది. ధరణిలో లోటుపాట్ల వల్ల కోర్టులకు వేలసంఖ్యలో కేసులు వచ్చాయి. ధరణి చట్టం తీసుకువచ్చేముందు ప్రజల మధ్య, శాసనసభలో చర్చ జరిగి ఉంటే ఇన్ని వేల కేసులు వచ్చి ఉండేవి కావు.
పారదర్శకతకు పాతర
సీనియర్ అధికారులు అప్పటి సీఎంకు సరైన సలహాలు ఇవ్వడానికి జంకారు.ప్రతి ప్రాజెక్టు,ప్రభుత్వంపెట్టే అభివృద్ది
పెట్టుబడులు ప్రజలతో సంప్రదింపులు లేకుండా చేపట్టడానికి కారణం అవినీతి. ఫలానా కాంట్రాక్టరుకు అవసరం కనుక ప్రాజెక్టు చేపట్టడం అలవాటుగా మారింది. ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయని ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు దాచి పారదర్శకతకు పాతరేస్తున్నారు. అవినీతిని అరికట్టాల్సిన రాజ్యాంగం ఏర్పరిచిన సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు.
అధికారం ఉన్నా దానిని వాడకపోవడం వల్ల ఏర్పడిన దుస్థితి ఇది. అధికారులలో, ప్రజా ప్రతినిధులలో నిష్క్రియాపరత్వం కూడా ఒక రకమైన అవినీతి వల్ల వచ్చిన పరిణామం. తనకు ఇచ్చిన బాధ్యత సదరు అధికారి నిర్వర్తించకపోవటం కూడా అవినీతికి నిదర్శనం. ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ వెళ్ళి లిఖితపూర్వ ఫిర్యాదు ఇస్తే కూడా తీసుకోకపోవటం మీద విపరీత చర్చ జరిగింది. తమ పరిధి కాదని రకరకాల కుంటి సాకులు చెప్పేవారు పోలీసులు. చివరికి న్యాయస్థానాలు జీరో ఎఫ్ఐఆర్ గురించి స్పష్టం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఇంకా చాలా ప్రభుత్వశాఖలలో అనేక రకాలుగా నిష్క్రియాపరత్వం కనపడుతున్నది. ప్రజలు ఈ సమస్యను నిత్యం ఎదుర్కొంటున్నారు.
ప్రజల ఫిర్యాదులు బుట్టదాఖలు
మైనింగ్ అధికారులు చట్టవ్యతిరేకంగా ఇసుక, రాయి మైనింగ్ జరుగుతున్నా, ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకువచ్చినా కదలడం లేదు. పోలీసు శాఖకు ఒక చట్టం ఉంది కనుక ఫిర్యాదు తీసుకోవాల్సిందే. ఇతర శాఖలకు ప్రజల ఫిర్యాదులను తీసుకోవాలని, తీసుకోకుంటే చర్యలు ఉండేవిధంగా చట్టాలు లేవు. అందుకే ప్రజల ఫిర్యాదులు బుట్టదాఖలు చేస్తున్నారు.
అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. అధికార కుర్చీలో కూర్చోగానే బాధ్యతలను మరుస్తున్నారు. ఎప్పుడైతే ప్రైవేటు పబ్లిక్ పార్టనర్ షిప్ (పీపీపీ) మొదలు అయ్యిందో ఆనాటి నుంచి ఈ సమస్య ఇంకా జటిలం అయ్యింది. అనేకరకాల ప్రభుత్వ విధులలో ప్రైవేటు సర్వీసు పెరిగిపోయింది. ఏది ప్రైవేటు, ఏది ప్రభుత్వ పని తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సరైన సేవలు అందడం లేదు.
గర్భిణులు, ఇతరుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఉదంతాలు అనేక చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులలో అనేక మరణాలు సరి అయిన వైద్యం అందకనే జరుగుతున్నాయి. ఈ మధ్య సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తున్నారు. ఎక్కువగా ఇది ప్రైవేటు సిబ్బంది ద్వారానే జరుగుతోంది. లబ్ధిదారుల జాబితా ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. అధికారులలో అలసత్వానికి, నిష్క్రియాపరత్వానికి ప్రొటోకాల్ ఒక సాకుగా మారింది.
ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ప్రజాప్రతినిధులు పర్యటనలు చేస్తూ, అధికారులతో మీటింగులు పెడుతూ, తాము ఏదో చేస్తున్నట్టు ప్రజలను మభ్యపెడుతున్నారు. నిత్యం సమీక్షలు చేస్తారు. అయినా ప్రజాసమస్యలు పరిష్కారం కావు. ప్రొటోకాల్ సాకుతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఉన్న పని చేయకపోవడం రివాజుగా మారింది.
కొరవడిన బాధ్యత
పరిపాలనా సోపానక్రమం (hierarchy) ఇప్పుడు అసమర్థంగా ఉంది. బాధ్యత, సహకారం, నాయకత్వం వగైరా ఇమిడి ఉన్న పరిపాలన కొరవడింది. వాస్తవానికి అధికారులు సమావేశాలకు హాజరుకావడం మంత్రి లేదా ఎమ్మెల్యే దగ్గర పేరు సంపాదించడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ లేదు. ఏదైనా ప్రజలకు చేసినప్పుడు, దానిలో సగం మాత్రమే చేస్తారు.
‘ఏమీ చేయకపోవడం అనేది ఒక నిర్ణయం’ అని అమెరికాలో ఒక రిపబ్లికన్ పార్టీ మాజీ ప్రతినిధి మిక్కీ ఎడ్వర్డ్స్ అన్నారు. అధికారం ఉండి కూడా ఏం చేయకపోవడం, స్పందించకపోవడం, నిశ్శబ్దంగా ఉండడం కూడా రాజకీయమే.
ప్రజాప్రయోజనాలు విస్మరించి ప్రైవేటు ప్రయోజనాలకు అనుగుణంగా ఏమీ చేయకపోవడం రాజకీయమే అవుతుంది. దీనికి స్పష్టమైన ఉదాహరణ అనేక ప్రాజెక్టులకు జరుగుతున్న భూసేకరణ, భూకబ్జాలు, కాలుష్యం మీద చర్యలు లేకపోవటం వంటివి. ఈ ధోరణి గమనించిన అవినీతి పాలకులు అధికారులతో తమకు కావాల్సిన పని చేయించుకోవడానికి ఒక కొత్త వ్యూహం తెరమీదకు తెచ్చారు. అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
ప్రైవేటు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేని పరిస్థితులలో అధికారులు ఫైళ్లను పక్కన పెడితే ‘వ్యాపారానికి సరళీకరణ’ పేరిట అనుమతులు తగ్గించి, తప్పనిసరై అనుమతులకు గడువు విధించారు. ఇది తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. అదే సమయంలో సామాన్యులకు అందించాల్సిన ప్రభుత్వ సేవలకు కాలసమయం విధించమని ఒత్తిడి వస్తే తూతూమంత్రంగా మార్గనిర్దేశకాలు తయారుచేసి వదిలేశారు.
పనిదొంగలను తొలగించాలి
ఆరోగ్య రంగంలో మెరుగుదల లేనందున అనారోగ్యంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు, కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రి ఖర్చు భరించలేక ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. పాసుబుక్కులలో భూమి విస్తీర్ణం తగ్గించడం, తరువాత సరిచేయకపోవడంతో వేదనకు గురై చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు.
తెలంగాణలో అనేక గ్రామాలు నీరు, గాలి, కాలుష్యంతో సతమతమవుతున్నా అధికారులు, జాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఒక్కనాడూ దాని కనీస ప్రస్తావన చేయలేదు. ఎప్పటికీ విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తున్నాం అనే మాట తప్పితే కాలుష్యంపై ఒక్కమాట మాట్లాడటం లేదు. ఫలితంగా కాలుష్యం చేసే పరిశ్రమలు, కాలుష్యకారకులు విచ్చలవిడిగా కాలుష్యం విస్తరిస్తున్నారు.
తెలంగాణ పాలనా సంస్కృతిలో వేళ్లూనుకుపోయిన అవినీతి, నిష్క్రియాపరత్వాన్ని ఎండగట్టాలి. పని చేయనివారిని ఇంటికి పంపాలి. ప్రజాధనంతో జీతాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టే ‘పని దొంగలను’ ఉద్యోగాల నుంచి తీసేయాలి.
అవినీతిని ఎండగట్టాలి
అధికారులలో నిష్క్రియాపరత్వం వల్ల వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థతో సహా మొత్తం సమాజంపై ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. ఈ ప్రతికూల ప్రభావాలు అనేక రూపాలలో ఉండవచ్చు. కాలుష్యం మీద చర్య తీసుకోకుంటే ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది. ఆర్థికరంగం మీద ప్రభావం ఉంటుంది. అధికారులలో అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది.
రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోతే గత పదేండ్లలో ఒక్క కంపెనీ మీద కూడా చర్య లేదు. ధాన్యం కొనుగోళ్లలో ప్రతిసారి తరుగు పేరు మీద ప్రతి బస్తాకు 5 కిలోల వరకు రైతుల నుంచి తస్కరిస్తే ఒక్క అధికారి, ప్రజా ప్రతినిధి కిక్కురుమనడంలేదు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోతే రైతు దీనస్థితి పట్ల కనీస స్పందన లేదు. అధికారగణంలో అవినీతిని ఎండగట్టాలి. ప్రభుత్వ అధికారులలో నిష్క్రియా సంస్కృతి వల్ల, ప్రజాసమస్యలపై చర్యలు తీసుకోవడంలో విఫలమవడం వల్ల కలిగే ఆర్థిక, సామాజిక పరిణామాల నష్టాలను బేరీజు వేయాల్సిన అవసరం ఉన్నది. రూపాయలలో లెక్కిస్తే కొన్ని వేల కోట్ల నష్టం ఉండవచ్చు.
-డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్–