రూ.400కే కరోనా టెస్ట్.. గంటలోనే రిజల్ట్: అధునాతన టెస్ట్ కిట్ రూపొందించిన ఐఐటీ రీసెర్చర్స్

రూ.400కే కరోనా టెస్ట్.. గంటలోనే రిజల్ట్: అధునాతన టెస్ట్ కిట్ రూపొందించిన ఐఐటీ రీసెర్చర్స్

కరోనా టెస్టు కాస్ట్‌ను, ఫలితం తెలియడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించేలా అధునాతన ఆవిష్కరణ చేశారు ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు. కేవలం రూ.400 ఖర్చులోనే కరోనా పరీక్ష చేసేలా సరికొత్త టెస్టు కిట్‌ను రూపొందించారు. దీని ద్వారా గంటలోపే కరోనా ఉందా లేదా అన్నదానిని నిర్ధారించవచ్చని, ఫలితాన్ని స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా సంబంధిత వ్యక్తికి తెలియజేయవచ్చిన తెలిపారు ఐఐటీ రీసెర్చర్స్. ప్రస్తుతం ప్రామాణికంగా చెబుతున్న ఆర్టీపీసీఆర్ టెస్టుతో సమానంగా ఎటువంటి తప్పులు లేని ఫలితాలను తాము రూపొందించిన డివైజ్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ‘ఆర్టీపీసీఆర్ కిట్ ఒక్కొక్కటి రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీని ద్వారా టెస్టు చేస్తే ఫలితం రావడానికి ఆరు గంటల వరకు సమయం పడుతుంది. శాంపిల్స్ పరీక్షించడానికి అయ్యే ఖర్చు కూడా రూ.2500 వరకు ఉంటోంది. కానీ మేం డిజైన్ చేసిన నూతన టెస్ట్ కిట్ చాలా పోర్టబుల్ డివైజ్. దీనిని ఎక్కడైనా పెట్టి పరీక్షలు చేయవచ్చు. దీని తయారీకి అయిన ఖర్చు కేవలం రూ.2 వేలు మాత్రమే. స్వాబ్ శాంపిల్స్ సేకరణ తర్వాత టెస్టు చేయడానికి ఏ మాత్రం నైపుణ్యం అవసరం లేదు. గంటలోపే ఫలితం వచ్చేస్తుంది’ అని చెప్పారు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి. ఈ డివైజ్ ద్వారా ఎన్ని టెస్టులైనా చేయొచ్చని, ప్రతి శాంపిల్‌కూ ఇందులో కెమికల్ అనాలసిస్ కోసం వాడే పేపర్ క్యాట్రిడ్జ్ మారిస్తే సరిపోతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీల సహకారంతో భారీ సంఖ్యలో ఈ టెస్టు కిట్లను తయారు చేస్తే  చాలా తక్కువ ఖరీదులోనే వీటిని అందుబాటులోకి తీసుకుని రావచ్చని అన్నారు.  మారుమూల ప్రాంతాల్లోకి సైతం ఈ డివైజ్‌ను తీసుకెళ్లి  సోలార్ పవర్ లేదా బ్యాటరీ సాయంతో కూడా టెస్టు చేయొచ్చని తెలిపారు. తాము రూపొందించిన మ్యాన్యువల్ చదివితే ఎటువంటి నైపుణ్యం లేని వారైనా కరోనా పరీక్షను ఈజీగా చేసేసి ఫలితం వెల్లడించవచ్చని అన్నారు ఈ రీసెర్చ్‌లో భాగమైన బయోసైన్స్ ప్రొఫెసర్ అరిందం మోండల్. తాము రూపొందించిన డివైజ్ రెడీ టూ యూజ్ కిట్ అని ప్రభుత్వం వీలైనంత వేగంగా దీనిని కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.