ఆధార్తో దోచేస్తరు.. అక్రమంగా లోన్లు తీసుకుంటున్న క్రిమినల్స్..క్రెడిట్ రిపోర్ట్పై కన్నేయాల్సిందే

ఆధార్తో దోచేస్తరు.. అక్రమంగా లోన్లు తీసుకుంటున్న క్రిమినల్స్..క్రెడిట్ రిపోర్ట్పై కన్నేయాల్సిందే

వెలుగు, బిజినెస్ ​డెస్క్: ఇతరుల పాన్, ఆధార్ కార్డులతో అక్రమంగా లోన్లు తీసుకోవడం ఆందోళనకరస్థాయికి చేరింది. ఇవి దుర్వినియోగం అవుతున్న విషయం చాలా మందికి తెలియడం లేదు. మనకు సంబంధం లేని ఈఎంఐ గురించి వచ్చే ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వవస్తోంది.

మనం ఎప్పుడూ లోన్ తీసుకోకపోయినా లేదా సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నా లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురైనప్పుడు కూడా ఈ సంగతి తెలుస్తుంది. ఇలాంటి మోసపూరిత లోన్లు మన క్రెడిట్ రిపోర్ట్​లో చేరితే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.  బ్యాంకుల నుంచి సేవలు పొందడం కష్టమవుతుంది. ఆధార్​ మోసాలను ముందుగానే గుర్తించి సరైన విధంగా స్పందించడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మీ పేరు మీద ఎవరైనా అప్పు తీసుకున్నదీ లేనిదీ తెలుసుకోవడానికి క్రెడిట్ రిపోర్ట్​ను తరచూ చెక్​ చేయాలి. 

బ్యాంకులు/ ఎన్​బీఎఫ్​సీలు పాన్ నంబర్ ఆధారంగా క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అందిస్తాయి కాబట్టి మీ ఇన్ బాక్స్ కంటే క్రెడిట్ రిపోర్ట్​ను చూడటం బెస్ట్​. రిపోర్ట్​ను పరిశీలించేటప్పుడు ప్రధానంగా మూడు విషయాలను గమనించాలి.  మీకు తెలియని లోన్ అకౌంట్లు ఏవైనా ఉన్నాయేమో చూడాలి.  లోన్​ కోసం జరిగిన ఎంక్వైరీలను తప్పకుండా పరిశీలించాలి. లోన్ మంజూరు కాకపోయినా దరఖాస్తు చేసిన ప్రతిసారీ ఆ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. మూడోది.. మీ వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. మోసగాళ్లు అప్పుడప్పుడు మీ ప్రొఫైల్ లో కొత్త ఫోన్ నంబర్ లేదా ఈ–మెయిల్ ఐడీని చేరుస్తుంటారు.  రిపోర్టులో ఇలాంటివి ఏవీ లేకపోతే ప్రస్తుతానికి మీరు సురక్షితంగా ఉన్నట్లేనని బ్యాంక్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు.

భయం వద్దు..
రికవరీ ఏజెంట్ల నుంచి కాల్స్ వస్తే భయపడకూడదు. ఈఎంఐ చెల్లించనప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ గా వారికి సమాచారం ఇస్తుంది. లోన్​ తీసుకున్నది మీరు కాదని  వివరించాలి. ప్రతి విషయాన్ని రాతపూర్వకంగా ఉంచడం వల్ల భవిష్యత్తులో మీకు బలం చేకూరుతుంది. దర్యాప్తు జరిగే సమయంలో మీ క్రెడిట్ రిపోర్టును తరచూ గమనిస్తూ ఉండాలి. 

ఒక్కసారి వివరాలు లీక్ అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంది. అందుకే అలర్ట్స్​ను యాక్టివేట్​ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీ డాక్యుమెంట్లను ఎవరికైనా పంపేటప్పుడు మాస్క్ చేయాలి. అంటే ఆధార్ లేదా పాన్ నంబర్ లోని కొన్ని అంకెలు కనిపించకుండా జాగ్రత్త పడాలి. కేవలం నమ్మకమైన సంస్థలకు మాత్రమే పూర్తి పత్రాలు ఇవ్వాలి.

ఇతరులకు ఇచ్చేటప్పుడు జాగ్రత్త
చాలామంది తమ పాన్ కార్డు ఎక్కడో పోయిందనో, దొంగతనం జరిగిందనో అనుకుంటారు.   వాస్తవానికి మన డాక్యుమెంట్లను ఇతరులకు ఇవ్వడం వల్లే మోసాలు జరుగుతాయి. తెలియని లోన్ యాప్స్​లో ఆధార్ అప్ లోడ్ చేయడం లేదా బ్రోకర్లకు పూర్తి వివరాలు పంపడం ప్రమాదకరం. వాట్సాప్ లో డాక్యుమెంట్లను పంపినప్పుడు లీక్ అయ్యే అవకాశం ఉంది. మోసగాళ్లు మీ వివరాలను వేరే మొబైల్ నంబర్ తో కలిపి డిజిటల్ లోన్లు తీసుకుంటారు. ముఖ్యంగా చిన్న మొత్తాల లోన్లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వీటిని సులభంగా పొందే అవకాశం ఉండటమే అందుకు కారణం.

మీ అనుమతి లేకుండా తీసుకున్న లోన్ కనిపిస్తే బ్యాంకుకు ఈ-మెయిల్ పంపాలి. ఆ అప్పు మీరు తీసుకోలేదని, అది గుర్తింపుకార్డు దొంగతనం అని స్పష్టంగా వివరించాలి. సదరు అకౌంట్ ను వివాదాస్పదమైనదిగా గుర్తించాలని కోరాలి. దర్యాప్తు పూర్తయ్యే వరకు రికవరీ చర్యలు ఆపాలని డిమాండ్ చేయాలి.

ఆన్ లైన్ లో లేదా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రసీదు తీసుకోవాలి. బ్యాంకులు లేదా క్రెడిట్ బ్యూరోలు పోలీసుల ఫిర్యాదు లేకుండా మీ సమస్యను పరిష్కరించడానికి ఆసక్తి చూపవు.  క్రెడిట్ బ్యూరోలోనూ ఫిర్యాదు ఇవ్వాలి. రిపోర్టులో ఆ లోన్ ఎంట్రీ పక్కన ‘ఐడెంటిటీ థెఫ్ట్’ అని మార్క్ చేయాలని కోరాలి.