కందిక‌ల్‌లో హైడ్రా కూల్చివేతలు

కందిక‌ల్‌లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బండ్లగూడ మండ‌లం కందిక‌ల్​లోని 303, 306 స‌ర్వే నంబ‌ర్లలోని ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు బుధవారం కూల్చివేశారు. 2,500 గ‌జాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం యూఎల్‌సీ ల్యాండ్ కాగా స‌య్యద్ బ‌షీరుద్దీన్‌, స‌య్యద్ అమీదుల్లా హుస్సేన్ అనే వ్యక్తలు క‌బ్జా చేశారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని త‌న పేరుమీద రెగ్యుల‌రైజ్ చేసుకునేందుకు చేసిన ప్రయ‌త్నాలు ఫ‌లించ‌కపోవడంతో అనుమ‌తులు లేకుండా షెడ్లు, రూమ్ లు నిర్మించారు.

స్థానికుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు, స్థానిక అధికారులు పరిశీలించి ప్రభుత్వ భూమిగా గుర్తించారు. హైకోర్టు కూడా ఈ అక్రమ క‌ట్టడాల‌ను తొల‌గించాల‌ని 2 నెల‌ల కింద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడ నిర్మించిన ఆర్‌సీసీ రూములు 4, రేకుల షెడ్డులు, 4 షాపులు లను హైడ్రా అధికారులు బుధవారం కూల్చివేశారు. ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. స‌య్యద్ బ‌షీరుద్దీన్‌, స‌య్యద్ అమీదుల్లా హుస్సేన్ కు చెందిన కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.