బఫర్​ జోన్‌‌ లో అక్రమంగా నిర్మాణాలు 

బఫర్​ జోన్‌‌ లో అక్రమంగా నిర్మాణాలు 
  •     బఫర్​ జోన్‌‌లో అక్రమంగా నిర్మాణాలు 
  •     బీఆర్ఎస్​ లీడర్లు, ఆఫీసర్ల అండతోనే ఆక్రమణలు 
  •     చెరువును కాపాడాలని కోరుతున్న స్థానికులు

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల కబ్జాలు ఆగడం లేదు.  అక్రమార్కులు ఎఫ్‌‌టీఎల్‌‌, బఫర్ జోన్‌‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్ల సహకారంతో ఆక్రమణలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు వారికే వంతపాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పటేల్​గూడ పంచాయతీ పరిధిలోని తీగలసాగర్​ చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా అడిగే వాళ్లు లేకుండా పోయారు.  ఎవరైనా స్థానికులు ఫిర్యాదులు చేస్తే అధికారులు తూతూ మంత్రంగా కూల్చి వేసి వెళ్లిపోతున్నారు.  వారంలో మళ్లీ యథాతథంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. 

రెండున్నర ఎకరాలు కబ్జా .. 

ఎల్లంకి ఇంజనీరింగ్​ కాలేజీ వెనకాల సర్వేనెంబర్​ 196లో  ఉన్న తీగలసాగర్​ఎఫ్​టీఎల్ పరిధిలో 10 ఎకరాలు ఉండగా ఇప్పటికే రెండున్నర ఎకరాలు కబ్జాకు గురైంది.  ఎఫ్‌‌టీఎల్‌‌, బఫర్​ జోన్ల పరిధిలో గృహ నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలు ఉన్నా.. అధికారులు పట్టించుకోవడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.  ప్రస్తుతం అక్కడ పదుల సంఖ్యలలో ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వందల మంది కార్మికులతో నిర్మాణాలు చేపట్టడమే కాదు.. ఎవరూ రాకుండా స్థానిక బీఆర్​ఎస్​లీడర్లు కాపలాగా ఉంటుండడం గమనార్హం. రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు రూలింగ్​పార్టీ లీడర్లకు భయపడి అక్రమాలను కట్టడి చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ఇండ్ల చుట్టూ నీళ్లు చేరుతున్నా.. 

తీగల సాగర్‌‌‌‌లో గతంలో నిర్మించిన ఇండ్లు చుట్టూ వానాకాలంలో చెరువు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ విషయమై గతంలో పర్యావరణ వేత్తలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.  ప్రస్తుతం నిర్మిస్తున్న ఇండ్లు కూడా తుదిదశకు వచ్చాయి. అయినా అధికారులు స్పందించడం లేదు. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి పటేల్​గూడ తీగల సాగర్​ చెరువును కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటం..  

పటేల్​గూడ పంచాయతీ పరిధిలోని తీగల సాగర్​ చెరువు ఎఫ్‌‌టీఎల్‌‌, బఫర్​జోన్‌‌లో ఇదివరకు నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశాం.  ఇరిగేషన్​అధికారుల సహకారంతో మరోసారి పరిశీలించి తొలగిస్తాం. అక్రమాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. సమగ్ర సర్వే చేయించి ఎఫ్‌‌టీఎల్‌‌ భూములను కాపాడుతాం. 
- సతీష్​రెడ్డి, డీఎల్‌‌పీవో