చర్లపల్లిలో డ్రగ్స్ డెన్..రూ.12 వేల కోట్ల విలువైన ముడిసరుకు పట్టివేత

చర్లపల్లిలో   డ్రగ్స్ డెన్..రూ.12 వేల కోట్ల విలువైన ముడిసరుకు పట్టివేత
  • 35 వేల లీటర్ల లిక్విడ్‌‌, 950 కిలోల కెమికల్ పౌడర్‌‌ స్వాధీనం‌‌
  • డ్రగ్‌‌ డీలర్లకు సప్లయ్‌‌ చేసేందుకు సిద్ధం చేసిన 5 కిలోల 968 గ్రాముల డ్రగ్స్​ కూడా..
  • గుట్టురట్టు చేసిన ముంబై క్రైమ్​బ్రాంచ్​ పోలీసులు
  • వాగ్దేవి -ల్యాబ్స్ ​పేరుతో సింథటిక్ డ్రగ్స్‌‌ తయారీ
  • నాచారం, చర్లపల్లిలో  మెఫెడ్రోన్ తయారీ కంపెనీల గుర్తింపు
  • దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిర్ధారణ
  • మహారాష్ట్రలో 11 మంది.. హైదరాబాద్‌‌లో ఇద్దరి అరెస్ట్​.. 
  • నిందితుల్లో బంగ్లాదేశ్​ యువతి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మేడ్చల్‌‌‌‌ జిల్లాలో భారీ డ్రగ్స్‌‌‌‌ తయారీ యూనిట్‌‌‌‌ గుట్టు రట్టయింది. చర్లపల్లిలో డ్రగ్స్​డెన్‌‌‌‌ను ముంబై పోలీసులు గుర్తించారు. ఫార్మా కంపెనీల ముసుగులో అతి ప్రమాదకర మెఫెడ్రోన్‌‌‌‌, మోలీ, ఎక్స్‌‌‌‌టసీ లాంటి డ్రగ్స్‌‌‌‌ను సప్లయ్ చేస్తున్న రెండు కంపెనీలపై  ముంబై క్రైమ్ డిటెక్షన్‌‌‌‌ యూనిట్‌‌‌‌ పోలీసులు  దాడులు చేశారు. 5 కిలోల 968 గ్రాముల మెఫెడ్రోన్‌‌‌‌(ఎండీ), 35,500 లీటర్ల సాల్వెంట్ సహా ఇతర కెమికల్స్‌‌‌‌, 19 బాక్సుల్లో నిల్వ చేసిన 950 కిలోల మిథైలిన్‌‌‌‌ డైక్లోరైడ్‌‌‌‌ (ఎండీసీ) పౌడర్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ రూ.12.58 కోట్లుగా నిర్ధారించారు. ఈ కెమికల్స్‌‌‌‌తో రూ.12వేల కోట్ల విలువ చేసే మెఫెడ్రోన్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ తయారు చేయవచ్చని గుర్తించారు. కంపెనీ నిర్వాహకులను ఇద్దరిని అరెస్ట్‌‌‌‌ చేసి ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌పై మహారాష్ట్రలోని థానేకు తరలించారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌‌‌‌లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరుసహా మొత్తం13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ కెమికల్​ఎక్స్​పర్ట్​సహా ఓ బంగ్లాదేశీ మహిళ ఉన్నారు. ఈ మేరకు ముంబై మీరా భాయిందర్​, వసాయి -విరార్‌‌‌‌ (ఎంబీవీవీ) సీపీ నికేత్‌‌‌‌ కౌషిక్‌‌‌‌ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఫార్మా ముసుగులో నిషేధిత డ్రగ్స్‌‌‌‌ తయారీ 

ఫార్మా కంపెనీల నిర్వాహకుడు శ్రీనివాస్‌‌‌‌ విజయ్‌‌‌‌ వోలేటి 2020లో చర్లపల్లి నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబ్స్​ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ఇక్కడ కరోన మందులను తయారు చేసేవారు. ఈ క్రమంలోనే 2015లో నాచారంలో వాగ్దేవి ఇన్నోసైన్స్‌‌‌‌ ఏర్పాటు చేశాడు. దీన్ని రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ పేరుతో నిర్వహిస్తున్నారు. అయితే ఫార్మా కంపెనీలుగా రికార్డుల్లో చూపుతూ అంతర్గతంగా డగ్స్‌‌‌‌ తయారీకి తెరతీసినట్టు తెలిసింది. ఆపరేషన్ల సమయంలో వినియోగించే మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్ తయారీకి అవసరమైన మెఫెడ్రోన్‌‌‌‌ను డ్రగ్స్ మాఫియాకు విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారు చేస్తున్న మెఫెడ్రోన్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ను మెడిసిన్స్ తయారీకి కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ ముఠాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.ముంబై సహా దేశ వ్యాప్తంగా మెఫెడ్రోన్ సప్లయ్ చేస్తున్నారు.

దందా ఇలా బయటపడింది..

ముంబై సహా మహారాష్ట్రలో డ్రగ్స్ సప్లయర్లపై అక్కడి క్రైమ్ బ్రాంచ్, థానే ఎంబీవీవీ పోలీసులు నిఘా పెట్టారు. మీరా రోడ్‌‌ ఈస్ట్‌‌లో నివాసం ఉండే బంగ్లాదేశీ యువతి ఫాతిమా మురాద్‌‌షేక్‌‌ అలియాస్‌‌ మొల్లా (23) మెఫెడ్రోన్‌‌ డ్రగ్‌‌ను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆగస్టు 8న కాశీమీరా బస్‌‌స్టాప్‌‌ దగ్గర ఫాతిమాను అదుపులోకి తీసుకోగా..ఆమె వద్ద 105 గ్రాముల మెఫెడ్రోన్‌‌ పట్టుబడింది. దీంతో గత ఆగస్టు 8న ఆమెపై 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌‌స్టాన్సెస్ యాక్ట్,  ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్  కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. హైదరాబాద్‌‌ లింకులు బయటపడ్డాయి. మెఫెడ్రోన్‌‌ను తాను హైదరాబాద్‌‌ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు యువతి సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలోనే మెఫెడ్రోన్‌‌ సప్లయ్‌‌ చేసే మరో పది మంది వివరాలు అందించింది. దీంతో ఫాతిమాసహా మొత్తం 11 మందిని థానే ఎంబీవీవీ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. వారి వద్ద178 గ్రాముల  మెఫెడ్రోన్, రూ. 23 లక్షల 97వేల  విలువైన నగదు, అలాగే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఫాతిమా ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ సప్లయ్ చేసిన కంపెనీల వివరాలు సేకరించారు. మేడ్చల్‌‌ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్‌‌, నాచారంలో వాగ్దేవి ఇన్నోవేషన్స్‌‌ ఫార్మా  కంపెనీల్లో మెఫెడ్రోన్‌‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

డెలివరీకి సిద్ధంగా ఉన్న 6 కిలోల మెఫెడ్రోన్‌‌ స్వాధీనం

శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. డెలివరీ చేసేందుకు సిద్ధం చేసిన 6 కిలోల మెఫెడ్రోన్‌‌ సహా రూ.12 వేల కోట్లు విలువ చేసే మెఫెడ్రోన్‌‌ తయారు చేయగల ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కంపెనీల నిర్వాహకులు  శ్రీనివాస్‌‌ విజయ్‌‌ వొలేటి, తానాజి పండరీనాథ్‌‌ పట్వారీలను అరెస్ట్‌‌ చేసి థానేకు తరలించారు. మేడ్చల్‌‌ జిల్లా నాచారం, చర్లపల్లిలో తయారు చేస్తున్న డ్రగ్స్‌‌ పలు రాష్ట్రాలు, దేశాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. మెఫెడ్రోన్‌‌ డ్రగ్స్​ దందాలో దేశంలోని డ్రగ్స్ ముఠాలతోపాటు అంతర్జాతీయస్థాయిలో సంబంధం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని ఎంబీవీవీ సీపీ నికేత్‌‌ కౌషిక్‌‌ తెలిపారు.  ‘‘మెఫెడ్రోన్‌‌తో పాటు ఇంకా ఎలాంటి డ్రగ్స్‌‌ తయారు చేస్తున్నారు? వీరి నెట్‌‌వర్క్‌‌ ఎక్కడివరకూ విస్తరించి ఉంది?” అనే వివరాలను సేకరిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల దాడులతో రాష్ట్రంలోని ఈగల్‌‌ ఫోర్స్ అప్రమత్తమైంది. ఈ మేరకు థానే ఎంబీవీవీ పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నది.