చీమలపాడు అడవి నుంచి అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

చీమలపాడు అడవి నుంచి అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

జూలూరుపాడు, వెలుగు : మండలపరిధిలోని పాపకొల్లు బీట్, చీమలపాడు అడవి నుంచి  ట్రాక్టర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న కలపను  సోమవారం పారెస్ట్​ అధికారులు పట్టుకున్నారు. పారెస్ట్​ రేంజర్​ ప్రసాదరావు  తెలిపిన వివరాల ప్రకారం.. పడమటి నరసాపురం గ్రామానికి చెందిన మాలోత్ కిషన్  పొలంలోని కాకర పాదుల కర్రల కోసం అదే గ్రామానికి చెందిన కొంతమంది కూలీలతో కలిసి అక్రమంగా అటవీ నుంచి కలపను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు.

విషయం ఫారెస్టు అధికారులకు తెలియడంతో ట్రాక్టర్​ను పట్టుకొని అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించి,  కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.21వేలు ఉంటుందని రేంజర్​ తెలిపారు. దాడిలో ఎఫ్ఎస్వో మల్లయ్య, కిషన్, చింత వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.