డెవలప్​మెంట్​ వర్క్స్​ పేరుతో ఇల్లీగల్ దందా

డెవలప్​మెంట్​ వర్క్స్​ పేరుతో ఇల్లీగల్ దందా

మహబూబ్​నగర్​, వెలుగు: ప్రభుత్వ పనుల పేరుతో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు వారం రోజులుగా పాలమూరు జిల్లాలో ఆందోళనకు దిగుతున్నారు. ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు పడిపోయి, సాగులో ఉన్న వరి పంటలకు నీటి కటకట ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. పంటలకు మరో రెండు నెలల వరకు నీరు అవసరం ఉందని, అంతవరకు ఇసుక తరలించొద్దంటూ టిప్పర్లను గ్రామాల్లోకి రానివ్వకుండా తిప్పి పంపుతున్నారు. మహబూబ్​నగర్​జిల్లాలోని ఊకచెట్టువాగు, పెద్దవాగు, మీనాంబరం, దుంధుబీ, రంగారెడ్డిపల్లివాగు ఆధారంగా అడ్డాకుల, మూసాపేట, గండీడ్, మహమ్మదాబాద్, దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, నవాబ్​పేట మండలాల్లో బోర్ల కింద 46 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వానాకాలం వడ్లను అమ్ముకునేందుకు లేట్​కావడంతో యాసంగి సాగును రైతులు ఆలస్యంగా మొదలుపెట్టారు. నవంబరు నుంచి డిసెంబరు వరకు వరి నాట్లు వేసుకోవాల్సి ఉండగా జనవరిలో మొదలుపెట్టారు. ఈ పంటలు చేతికి రావడానికి ఏప్రిల్​వరకు టైం పడుతుంది.

 అప్పటివరకు పంటలకు సాగునీరు అవసరమవుతుంది. ఎండలు ముదురుతుండడంతో ప్రస్తుతం వాగుల్లో నీరు ఇంకిపోయి ఇసుక నిల్వలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఆఫీసర్లు సీసీ రోడ్లు, డబుల్​ బెడ్ రూమ్​ఇళ్ల నిర్మాణాల కోసమని ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. దీంతో వాగుల పొంటి బోర్ల ఆధారంగా వరి పంటలు వేసుకున్న  బండ్రవల్లి, లాల్​కోట, గుడిబండ, పళ్లమర్రి, ముచ్చింతల, అప్పంపల్లి, వడ్డేమాన్, మద్దూరు, అల్లీపూర్, కొమిరెడ్డిపల్లి, పేరూరు, వర్నే, ముత్యాలంపల్లి, లోకిరేవు, చౌటపల్లి, ఇప్పటూరు, కారూరు, సల్కర్​పేట్, మంగంపేట్, అన్నారెడ్డిపల్లి, ధర్మాపూర్,  సింగందొడ్డి, దోనూరు, పస్పుల, వాడ్యాల, మున్నూరు, మిడ్జిల్, అయ్యవారిపల్లి, వెలుగొముల, చిల్వేర్, కొత్తూరు గ్రామాల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇవ్వొద్దని డిమాండ్​ చేస్తున్నారు. వాగుల్లో ఇసుక తవ్వేందుకు వస్తున్న జేసీబీలు, ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోతే తమ పంటల పరిస్థితేంటని ఆఫీసర్లను నిలదీస్తున్నారు. 

పర్మిషన్ల పేరుతో ఇల్లీగల్ దందా

ఇసుక తరలించడానికి పర్మిషన్లు తీసుకుంటున్న వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరంతా బీఆర్ఎస్​పార్టీకి చెందిన లీడర్లు కావడంతో ఆఫీసర్లు కూడా అడ్డు చెప్పడం లేదు. దీనికితోడు వీరికి దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన లీడర్ల అండ ఉండటంతో పర్మిషన్ల పేరుతో ఇల్లీగల్ దందాకు తెరలేపారు. అధికారికంగా ఉదయం ఒకటి, రెండు ట్రిప్పుల ట్రాక్టర్లలో ఇసుకను తరలించి, రాత్రిళ్లు విచ్చలవిడిగా దోచుకుపోతున్నారు. ట్రాక్టర్లకు బదులు టిప్పర్లలో పెద్ద మొత్తంలో ఇసుకను వనపర్తి, హైదరాబాద్​, నారాయణపేట, కొత్తకోట, ఆత్మకూర్, మహబూబ్​నగర్​ ప్రాంతాలకు తరలించి క్యాష్​ చేసుకుంటున్నారు. పర్మిషన్ల పేరుతో పెద్ద మొత్తంలో ఇసుక తరలించుకుపోతున్నారనే విషయం అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇందులో రెవెన్యూ, పోలీస్ డిపార్ట్​మెంట్లకు చెందిన కొందరికి ముందే వాటాలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిళ్లు టిప్పర్లలో తరలించిన ఇసుకను ఓ ఏరియాలో డంప్​ చేస్తున్నారు. అనంతరం ఆ ఇసుకను ప్రైవేట్​ వ్యక్తులకు రూ.35 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముకుంటున్నారు. గ్రామస్తులు దీని మీద కంప్లైంట్​ చేస్తే పోలీసులు నామ్​కే వాస్తేగా వెహికల్స్​ను స్టేషన్​కు తరలించి, ఒక రోజు తర్వాత విడిచి పెడుతున్నారని రైతులు, ప్రజలు  పేర్కొంటున్నారు. 

డెవలప్​మెంట్​ పనుల కోసం..

ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్ల నిర్మాణాలు ఈ నెల 15 వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే రంగారెడ్డిపల్లి వాగులో పర్మిషన్ ఇచ్చాం. అక్కడ వాగు పక్కన ఉన్న రైతులు అడ్డుకున్నారు. వాగులో ఇసుక తీస్తే వారి పంటలకు నీళ్లు లేకుండా పోతాయని చెప్పారు. సాలార్ నగర్ ప్రాజెక్టు నుంచి వరి చేలకు నీళ్లు అందించేలా అధికారులతో మాట్లాడతాం. 

జ్యోతి, తహసీల్దార్, గండీడ్

అడ్డుకుంటే దాడి చేసిండ్రు
అన్నారెడ్డిపల్లిలో ఉన్న మా పొలం పక్కనే వాగు ఉంది. గత నెల 10న అర్ధరాత్రి కంచన్​పల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు రెండు ట్రాక్టర్లలో ఇసుక నింపుతుంటే అడ్డుకున్నా. దీంతో నాపై దాడి చేశారు. ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్​ చేశా. కానీ, రెండు ట్రాక్టర్లు ఉంటే ఒక ట్రాక్టర్ పోలీస్​స్టేషన్​కు తరలించి.. ఇంకో ట్రాక్టర్​ను వదిలిపెట్టిండ్రు.

- రాంరెడ్డి, మంగంపేట్, మహమ్మదాబాద్ మండలం