- ట్రాక్టర్లు పోయేందుకు ఏకంగా చెరువు కట్ట తొలగింపు
- రాత్రికి రాత్రే రూ.లక్షల్లో సంపాదిస్తున్న గుత్తేదారు
- పట్టించుకోని అధికారులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ చెరువును కాంట్రాక్టరే చెరబడుతున్నాడు. అర్ధరాత్రి జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు, టిప్పర్లతో జోరుగా మట్టి రవాణా చేస్తున్నాడు. కాంట్రాక్టులో వచ్చే లాభం సరిపోవడం లేదో ఏమో పాపం.. అక్రమంగా మట్టి కొడుతూ రోజుకు రూ.లక్ష వెనకేసుకుంటున్నాడు. కనీసం వర్క్ ఆర్డర్ కూడా లేకున్నా అన్ని పర్మిషన్లు ఉన్నాయని బుకాయిస్తూ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లక్షల విలువైన చెరువు మట్టి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు యథేచ్ఛగా తరలిపోతున్నా అటువైపు కన్నెత్తి చూడడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రూ.3.14 కోట్లతో పునరుజ్జీవం
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా చెరువుల పునరుజ్జీవం కోసం భారీగా ఫండ్స్ కేటాయించింది. జిల్లాలో ఏడు చెరువులను ఎంపిక చేయగా అందులో నస్పూర్ పెద్ద చెరువు కూడా ఉంది. రూ.3.14 కోట్లతో పునరుజ్జీవం పనులు చేపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్ఆర్ ఎడ్పీజ్ సంస్థ ఆదిలాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని నాలుగు చెరువుల కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ సంస్థ నేరుగా పనులు చేయకుండా లోకల్‌గా కొంతమందికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చింది. నస్పూర్ పెద్ద చెరువు పనులను పెంచాల శ్రీధర్ అనే వ్యక్తికి అప్పగించింది. సివిల్ వర్క్స్ చేసిన అనుభవం లేదని తెలిసింది. పునరుజ్జీవం పనుల్లో భాగంగా రూ.81 లక్షలతో దాదాపు 765 మీటర్ల పొడువు చెరువు కట్టను బలోపేతం చేయాలి. దీనికి సంబంధించిన మట్టి పనులు వారం పది రోజుల క్రితమే పూర్తయ్యాయి.
చెరువు కట్టను తొలగించి..
పునరుజ్జీవం పనుల పేరిట పాగా వేసిన సబ్ కాంట్రాక్టర్ దొంగచాటుగా చెరువు మట్టిని అమ్ముకోవడం మొదలుపెట్టాడు. విలేజ్ నస్పూర్‌కు వెళ్తుండగా ఎడమవైపు ఉన్న చెరువు కట్టను ట్రాక్టర్లు పోయేందుకు వీలుగా కొంతభాగం తొలగించాడు. కట్ట పోయమని కాంట్రాక్ట్ ఇస్తే... ఉన్న కట్టను తొలగించాడు. రాత్రిళ్లు జేసీబీలతో మట్టి తోడుతూ ట్రాక్టర్లతో పక్కనే ఉన్న వెంచర్లో డంప్ చేయిస్తున్నాడు. ఆ మట్టిని తెల్లవారుజామున టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నట్టు సమాచారం. ఒక్కో టిప్పర్‌కు రూ.20 వేల చొప్పున రాత్రికి రాత్రే రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇందులో అధికారులకు వాటాలున్నాయా? అందుకే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
ఈ విషయమై ఇరిగేషన్ ఏఈఈ విజయభాస్కర్‌ను సంప్రదించగా.. ‘పునరుజ్జీవం పనుల కోసం నస్పూర్ పెద్ద చెరువును పబ్లిక్ హెల్త్ అధికారులకు హ్యాండోవర్ చేశాం. పనులు పూర్తయిన తర్వాత తిరిగి ఇరిగేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. అప్పటివరకు ఆ చెరువుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఏం జరిగినా పబ్లిక్ హెల్త్ అధికారులదే బాధ్యత’ అన్నారు. పబ్లిక్ హెల్త్ డీఈఈ మధుకర్‌ను సంప్రదించగా... ‘పునరుజ్జీవం పనుల్లో భాగంగా మట్టి పనులు రెండు వారాల క్రితమే పూర్తయ్యాయి. మట్టి తవ్వకాలు నిలిపివేశాం. సబ్ కాంట్రాక్టర్ మట్టి తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎంక్వైరీ చేసి కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
