
గ్రేటర్ సిటీలో పెరిగిపోతున్న అక్రమ నీటి వాడకం
వాటర్ బోర్డులో కొందరు లైన్ మెన్ల చేతివాటం
అపార్ట్మెంట్స్, వాణిజ్య వ్యాపారుల నుంచి ముడుపులు
నీటి సరఫరా సమయం కుదింపు, ప్రెషర్ తగ్గుదల
సమ్మర్ లో వినియోగదారులకు ఎదురైన ఇబ్బందులు
అక్రమాలకు పాల్పడే లైన్ మెన్లపై చర్యలు తీసుకోవాలంటున్న వినియోగదారులు
హైదరాబాద్, వెలుగు: వాటర్‌బోర్డులో పనిచేసే లైన్మెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లంచాలు తీసుకుంటూ ఎక్కువ సమయం నీరువచ్చేలా, ప్రెషర్ బాగుండేలా చేస్తున్నారు. దీంతో అసలైన వారికి సరిగా సరఫరా జరగక ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు సరఫరా చేస్తున్న దాదాపు 500 ఎంజీడీల నీటిలో అధికశాతం అక్రమ వినియోగదారులకే సరఫరా చేస్తూ.. బోర్డు ఆదాయానికి కొందరు లైన్ మెన్ లు గండి కొడుతున్నారు. సిటీలో అపార్ట్మెంట్ వాసులు, హోటళ్లు, నిర్మాణ దారులు, బోర్లు సరిగా పని చేయని వారంతా లైన్మెన్లకు చెల్లించుకుంటే చాలు. వెంటనే ఎక్కువ సమయం నీటి సరఫరా, ప్రెషర్‌తో వచ్చేలా చూస్తున్నారు. ఇలాంటివారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ నీటి వాడకం ఇలా..
వాటర్ బోర్డు పరిధిలో మొత్తం 23 ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ డివిజన్లు, 50కి పైగా సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక లైన్మెన్ ఉంటారు. వీరు నీటి సరఫరా జరిగే సమయంలో పైప్‌లైన్ వాల్వ్ లను తిప్పుతుంటారు. నిర్ణయించిన మేరకు థ్రెడ్లను ఓపెన్ చేయాలి. ఎక్కువ థ్రెడ్లను తిప్పితే ఎక్కువ ప్రెషర్‌తో సరఫరా అవుతుంది. ఆయా ప్రాంతాలకు నిర్ణయించిన సమయం వరకూ నీటిని వదలాలి. అనంతరం థ్రెడ్లను మూసివేస్తే నల్లాలు బంద్ అవుతాయి. ఇక్కడే కొందరు లైన్మెన్లు చేతివాటం చూపుతున్నారు. లోకల్‌గా ఉండే లీడర్ల ఒత్తిళ్లతో కొందరు కాలనీవాసులు, అపార్ట్మెంట్ వాసులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి థ్రెడ్స్ ఎక్కవ తిప్పడం చేస్తున్నారు.
లేదంటే ఎక్కువ సమయం నీటి సరఫరా జరిగేలా చూస్తున్నారు. కొందరు హోటళ్లు, నిర్మాణ ప్రాంతాల్లో నల్లాలు ప్రెషర్‌తో వచ్చేలా చేస్తున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఎక్కువ మంది ఉంటుండగా నల్లానీరు సరిపోదు. లైన్‌మెన్‌తో మాట్లాడుకుని డబ్బు చెల్లిస్తున్నారు. మరికొందరు లైన్మెన్లు రాత్రికి రాత్రే అక్రమ కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. గ్రేటర్ సిటీలో 13.80 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నట్టు రికార్డు చెబుతున్నాయి. అనధికార కనెక్షన్లు మరో 4లక్షల వరకు ఉండొచ్చు. వాటర్ బోర్డు రోజుకు సరఫరా చేసే 500 ఎంజిడీల నీటితో నెలకు రూ. 20కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. కానీ అక్రమ కనెక్షన్లు, అక్రమ వాడకం కారణంగాబోర్డుకు మరో 10 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు వాటర్ ఆడిట్ చేపట్టకపోవడంతో ఎంత వాటర్ సరఫరా అవుతోంది..? ఎంత ఆదాయం వస్తుంది? అనే లెక్క తేలడం లేదు.
సమ్మర్ లో నీటి కష్టాలకు వీరే కారణం
సమ్మర్ లో చాలా ప్రాంతాల్లో కొందరు లైన్మెన్లు అక్రమ దందా చేశారనే ఆరోపణలు వచ్చాయి. డబ్బు ఇచ్చిన వారికి నీటి సరఫరా ఎక్కువ చేసినట్టు, శివారు ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉండడం, అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాల్లోనూ బోర్లు ఎండిపోవడంతో వాటర్‌బోర్డు నీటి పైనే ఆధారపడ్డారు. కొందరు వాటర్ ట్యాంకర్లను బుక్‌చేసుకోగా, మరికొందరు స్థానిక లైన్మెన్లను మేనేజ్ చేసుకుని అక్రమంగా నీటిని పొందారు. సమ్మర్ లో చాలా ప్రాంతాల్లో తక్కువ సమయం నీటి సరఫరాకు కొందరు లైన్మెన్లే కారణమని అధికారులు తేల్చారు. జూబ్లీహిల్స్, మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగా చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ కొందరు లైన్మెన్లను బోర్డు ఎండీ సస్పెండ్ కూడా చేశారు. అయినా కొందరు లైన్ మెన్లు ఎలాంటి భయం లేకుండానే అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే లైన్ మెన్లను అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకుంటే మిగతావారికి భయం ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు.