సూపర్ వైజర్ వేధింపులు.. జీహెచ్ఎంసీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

సూపర్ వైజర్ వేధింపులు.. జీహెచ్ఎంసీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

ఖైరతాబాద్ జోన్ పరిధిలో పలుచోట్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్ఎఫ్ఏ) ఆగడాలు శృతి మించిపోతున్నాయి. నెలనెలా డబ్బులు ఇవ్వాలంటూ కార్మికులను సూపర్​ వైజర్లు డిమాండ్​ చేస్తున్నారు. వేధింపులు భరించలేక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మికురాలు లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు రాకపోయినా సూపర్ వైజర్ మధు, కిరణ్ లు అక్రమంగా ఫింగర్ ప్రింట్స్ వాడుతూ తమ వేతనాలు నొక్కేస్తున్నారంటూ వెల్లడించింది. 21 మంది పని చేయాల్సిన దగ్గర కేవలం 10 మందితో పని చేయిస్తూ వేధిస్తున్నారని లక్ష్మీ ఆరోపించింది. ఫింగర్ ప్రింట్స్ వాడుతున్నారని ఐఏఎస్ ఆఫీసర్ కి చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితురాలు పేర్కొంది. అడిషనల్ కమిషనర్  సంతోష్ , ఐఏఎస్ సీఎంహెచ్ వో క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్లే సమస్యలు ఎదుర్కొంటున్నామని శానిటేషన్ కార్మికులు వెల్లడిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో తిరగాలని మంత్రి కేటీఆర్ చెప్పినా జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవలే ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్ లో ఫింగర్ ప్రింట్లు ఉపయోగిస్తున్న ముగ్గురు ఎస్ఎఫ్ఎలను పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. కార్మికురాలు లక్ష్మీ ఘటనతో ఎస్ఎఫ్ఏ ల ఆగడాలు.. ఫింగర్ ప్రింట్లు మరోసారి తెరపైకి వచ్చాయి. హాజరులు వేస్తూ క్షేత్రస్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు లంచాలు తీసుకొంటుండడం వల్లే ఇది కొనసాగుతోందని వర్కర్లు పేర్కొంటున్నారు. లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న అడిషనల్ కమిషనర్ సంతోష్ ఐఏఎస్ కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.