దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్న మోడీ

దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్న మోడీ
  • వారసత్వ రాజకీయాల వల్ల ట్యాలెంట్​ చచ్చిపోతోంది: ప్రధాని మోడీ
  • యువతకు అవకాశాలు రావాలంటే వారసత్వం పోవాలని వ్యాఖ్య
  • రాష్ట్రపతి కోవింద్​ స్వగ్రామం పరౌంఖ్​లో పర్యటన
  • లక్నోలో ఇన్వెస్టర్స్​ సమ్మిట్
  • రూ.80 వేల కోట్ల విలువైన 1,406 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన
  • పాల్గొన్న గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, వివేక్​​ వెంకటస్వామి

లక్నో: దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనేదే తన కోరిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాల విషయంలో తన అభిప్రాయాన్ని తప్పుగా కొందరు అర్థం చేసుకున్నారని, తాను ఏ రాజకీయ పార్టీ లేదా వ్యక్తుల గురించి మాట్లాడలేదని చెప్పారు. కానీ తన మాటలను తమను ఉద్దేశించి చేసినవిగా భావించిన వారే తనపై ఆగ్రహంతో ఉన్నారని, వారసత్వ రాజకీయాలను ప్రజలు విమర్శిస్తున్నా, వాటిని సమర్థించే వారందరూ తనకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారని అన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్​లోని కాన్ఫూర్​లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ స్వగ్రామమైన పరౌంఖ్​లో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మోడీ ముచ్చటించారు. పత్రి మాతా ఆలయాన్ని రాష్ట్రపతి, ప్రధాని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్​ భవన్​ను, కమ్యూనిటీ సెంటర్​గా మార్చిన రాష్ట్రపతి కోవింద్​ ఇంటిని వారిద్దరూ సందర్శించారు. దేశంలో టాలెంట్​ను ఎదగకుండా వారసత్వ రాజకీయాలు అడ్డుకుంటున్నాయని, గ్రామంలో పుట్టిన వ్యక్తి అయినా దేశానికి రాష్ట్రపతి, ప్రధాని అయ్యే అవకాశం ఉండాలని చెప్పారు. ఇది నిజం కావాలంటే రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాల నుంచి బయటకు రావాలని సూచించారు. ఇది మనదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు దక్కుతాయని చెప్పారు. తన గ్రామాన్ని సందర్శించిన ప్రధాని మోడీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరప్రదేశ్​లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. 

21వ శతాబ్దం యూపీదే: ఇన్వెస్టర్స్​ సమ్మిట్​లో మోడీ

21వ శతాబ్ధం యూపీదే అని, దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్​ దిక్సూచీగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. జీ-20 దేశాలలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం మనదేనని, ఈ రోజు ప్రపంచ దేశాలు నమ్మదగిన భాగస్వామిగా ఇండియా మారిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మనదేశానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్​ ఇన్వెస్టర్స్​ సమ్మిట్​3.0ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.80 వేల కోట్ల విలువైన 1,406 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్, యూపీ సీఎం యోగి, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, విశాక ఇండస్ట్రీస్​ చైర్మన్ వివేక్​ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదేండ్ల తన ప్రభుత్వ పాలన గురించి మోడీ మాట్లాడుతూ.. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్​ఫామ్​ అనే సూత్రాలను అనుసరిస్తోందని చెప్పారు. కార్పొరేట్లు, బిజినెస్​మెన్ల కలలకు యూపీ యువత రెక్కలు ఇస్తారన్నారు. రాబోయే 25 ఏండ్లు మన దేశానికి అమృత కాలమని, కొత్తగా తీసుకునే చొరవ దేశాన్ని మరిన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుందనే ఆకాంక్షను మోడీ వ్యక్తం చేశారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్​మెంట్, మాన్యుఫాక్చరింగ్​లపై మరింత ఫోకస్​పెడుతున్నట్లు పేర్కొన్నారు. సంస్కరణల ద్వారా దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్​ ఇంజిన్​ గవర్నమెంట్​లా పనిచేస్తున్నాయని సదస్సులో పాల్గొన్న వ్యాపారవేత్తలు కొనియాడారు.