ఒమిక్రాన్ తో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం 

ఒమిక్రాన్ తో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం 

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మన దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)హెచ్చరించింది. ఈ  క్రమంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అదనపు డోసును వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే సమయంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోని కీలక రాష్ట్రాల్లో నమోదయ్యాయని.. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుందని చెప్పింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరగనుందని చెప్పింది.

దేశంలో ఇప్పటికే 1.26 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేశారని... మొత్తం దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని IMA తెలిపింది. వ్యాక్సిన్ వల్ల కరోనా ఇన్ఫెక్షన్ ను  అరికట్టవచ్చనే విషయం ఇప్పటికే రుజువైందని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై మనం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ఒమిక్రాన్ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవచ్చని తెలిపింది. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కోరుతున్నామని చెప్పింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని వారిపై ఫోకస్ పెట్టాలని, వారు టీకా వేయించుకునేలా చూడాలని తెలిపింది.  

ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి మూడో డోసు వ్యాక్సిన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని..వీరితో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కూడా అదనపు డోస్ ఇవ్వాలని తెలిపింది. ఒమిక్రాన్ తో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదని... కానీ, డెల్టా వేరియంట్ కంటే 5 నుంచి 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని IMA చెప్పింది. అంతేకాదు ..వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ట్రావెల్ బ్యాన్ విధించాలని తాము సూచించడం లేదని తెలిపింది. అయితే అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని.. పెద్ద సంఖ్యలో గుమికూడటం చేయవద్దని చెప్పింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో కరోనా  ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించాలని తెలిపింది.