
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతాయని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ లోను రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
భద్రాద్రి, హనుమకొండ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడినట్టు ఐఎండీ వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లా ఉరుమద్లలో 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెమ్మానిలో 6.1, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో 6, నల్గొండ జిల్లా ఈదులూరులో 5.8, యాదాద్రి జిల్లా రామన్నపేటలో 4.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోనూ సాయంత్రం పలు చోట్ల వర్షం పడింది. నాగోల్ లో 3.7 సెంటీమీటర్లు, ముషీరాబాద్‌లో 3.1, అల్వాల్ టెలికాం కాలనీలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.