బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలోనూ 4 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలోనూ 4 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం ( ఆగస్టు 27 ) నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇదిలా ఉండగా అల్పపీడన ప్రభావం ఏపీపై కూడా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా,దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

Also Read : వరదలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం.. జిల్లా అధికారులతో మాట్లాడిన హోమ్ మంత్రి అనిత అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తూ ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి అనిత.ప్రతి మండల కేంద్రాలు, సచివాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి అనిత.

భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు అధికారులు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు జలాశయాలు నిండు కుండలా మారాయి. పలు చోట్ల వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు అధికారులు.