కేరళలో భారీ వర్షాలు: 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

కేరళలో భారీ వర్షాలు: 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఉదయం నుంచి కుండపోత వానలు కురుస్తుండడంతో కేరళ దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ విభాగం (IMD)తెలిపింది. దీనికి సంబంధించి ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కూటిక్కల్ ప్రాంతంలో వరద కారణంగా ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.

 ఆరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుట్టనాడ్ ఏరియాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచింది. కొట్టాయం జిల్లాలో ఓ కారు వరదల్లో కొట్టుకుపోయింది. పూంజార్ లో ఓ బస్సు వరదల్లో చిక్కుకుపోగా..అందులోని ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు.