ఇయ్యాల (ఆగస్ట్ 13), రేపు (ఆగస్ట్ 14) భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఇయ్యాల (ఆగస్ట్ 13), రేపు (ఆగస్ట్ 14) భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడ్తున్నాయి. వచ్చే 5 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. తర్వాతి మూడు రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో ఇది బలపడే చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నది. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడిందని, అయితే.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

బుధవారం హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారానికి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 రోజులకు ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేసిన వాతావరణ శాఖ.. చాలా జిల్లాల్లో అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

జిల్లాల్లో అర్ధరాత్రి దంచికొట్టిన వాన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా వరంగల్, సూర్యాపేట, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంగెంలో అత్యధికంగా 19.7 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.

సూర్యాపేట జిల్లా నాగారంలో 18.8 సెంటీ మీటర్లు, తిరుమలగిరిలో 18, వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్లో 15.8, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 13.2, వరంగల్​లో 13, వర్ధన్నపేటలో 12.8, జనగామ జిల్లా కొడకండ్లలో 12.4, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 12.1, మహబూబాబాద్ జిల్లా పెదవంగరలో 11.8, హనుమకొండలో 11.4, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 11.3, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 10.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి.

ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న వరద
కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద భారీగా వస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా.. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్​ ప్రాజెక్టులోకి 1.86 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా.. 16 గేట్లు ఎత్తి అంతే వరదను వదులుతున్నారు.

ఇటు జూరాలకూ లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. అయితే, అదే సమయంలో గోదావరిపైన ఉన్న ప్రాజెక్టులకు మాత్రం వరద రావడం లేదు. అయితే, ఇటీవలి కాలంలో శ్రీరాంసాగర్​కు వచ్చిన స్వల్ప వరదలతో ఆ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 80 టీఎంసీలకుగానూ 45 టీఎంసీలదాకా నీటి నిల్వ ఉన్నది.

పీఆర్, ఆర్డీ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు: ఆ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ సృజన ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జి. సృజన తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సైతం విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు విధులకు హాజరు కావాలని, ప్రజలకు  అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల్లో కిందిస్థాయి సిబ్బంది విధుల్లో ఉండేలా చూడాలని డీఆర్డీఓలు, డీపీఓలకు ఆదేశాలిచ్చారు.

సిటీలో వచ్చే 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి
హైదరాబాద్ సిటీలో 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైడ్రా హెచ్చరించింది. 13, 14, 15వ తేదీల్లో వర్షపాత తీవ్రత ఎక్కువగా ఉంటుందని కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. హైదరాబాద్ ఉత్తరాది ప్రాంతాలు, మేడ్చల్ జిల్లా, సైబరాబాద్ ఏరియాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్​లోని మిగతా ప్రాంతాల్లోనూ అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వరకు వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని తెలిపారు.

చాలా చోట్ల 10 నుంచి 15 సెంటీ మీటర్ల వర్షం కురిసే చాన్స్ ఉందని చెప్పారు. వచ్చే 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మూవ్​మెంట్​ను తగ్గించుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్​లోని స్కూళ్లకు సెలవులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి హైడ్రా సిఫార్సు చేసింది. ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసుకోవాలని సూచించింది.