
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)లో భారత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కేవీ సుబ్రమణియన్ సర్వీసులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఆయన మూడేళ్ల టర్మ్ ముగిసే ఆరు నెలల ముందు ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం చేయడంపై ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ నెల 9న చర్చించనుంది. గత నెలలో జరిగిన పహల్గాం టెర్రర్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌ను దౌత్యపరంగా, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన విషయం తెలిసిందే. కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) సుబ్రమణియన్ సర్వీసులను ఈ ఏడాది ఏప్రిల్ 30 న రద్దు చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఆయనను ఎందుకు తొలగించారో ప్రభుత్వం ప్రకటించలేదు. త్వరలో ఐఎంఎఫ్ బోర్డ్‌కు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నామినేట్ చేసే అవకాశం ఉంది.
సుబ్రమణియన్ ఐఎంఎఫ్ డేటా సెట్స్‌పై ప్రశ్నలులేవనెత్తారని, ఈ సంస్థలోని కొందరికి ఇది నచ్చలేదని తెలిసింది. గతంలో కూడా భారత్ రుణ స్థితిపై సుబ్రమణియన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఐఎంఎఫ్‌కు సంతృప్తి కలిగించలేదు. ఆయన నవంబర్ 1, 2022 న మూడేళ్ల కాలానికి ఈ పదవిలో చేరారు.