బీజేపీ, మోదీకి తక్షణ సవాళ్లు

బీజేపీ, మోదీకి తక్షణ సవాళ్లు

పార్లమెంటులో మెజారిటీ విషయంలో బీజేపీ సారథ్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సవాలు లేదు. పార్లమెంటులో 300 మంది ఎంపీల సంఖ్య చాలా కంఫర్టబుల్ నంబర్.  ఎన్డీఏ కూటమి బలం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే, బీజేపీ, ప్రధాని మోదీ ముందున్న తక్షణ సవాళ్లు 2024 నవంబర్‌‌‌‌లో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌‌‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.  ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. జార్ఖండ్‌‌‌‌లో బీజేపీయేతర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రాలు మోదీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ప్రజలు మోదీ సర్కారు పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా ప్రతికూలంగా ఉన్నారో మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సూచిస్తాయి.


ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌‌‌‌లలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు బీజేపీకి ఆందోళనకరమైన సంకేతాలను ఇస్తే,  ప్రతిపక్షాల్లో జోష్​ను నింపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే, బీజేపీ పుంజుకోవడానికి ఎన్నికల్లో విజృంభించడానికి ఇంకా తగినంత సమయం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో  తిరిగి అధికారం పొందడానికి బీజేపీ ఇప్పటికే  దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.  2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మోదీకి ప్రజాకర్షణ ఉందని తేలినా, ప్రజలు వివిధ సమస్యలపై అసంతృప్తితో ఉన్నారని తేలింది.  కాబట్టి, కమలం పార్టీపై ప్రజల వ్యతిరేకతను అధిగమించేందుకు అవసరమైన చర్యలతోపాటు సమస్యలను పరిష్కరించేందుకు మోదీ ప్రయత్నిస్తారు.

మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ

2019లో  మహారాష్ట్రలోని 48 పార్లమెంటు స్థానాలకుగాను 41 మంది ఎంపీలను బీజేపీ కూటమి భారీస్థాయిలో గెలుచుకుంది. కానీ, 2024 ఎన్నికల్లో బీజేపీ కేవలం 18 ఎంపీలను గెలుచుకోగా.. శరద్ పవార్, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేలతో కూడిన ఇండియా కూటమి 30 ఎంపీలను గెలుచుకుంది. ఇది బీజేపీకి చెంపపెట్టుగా, పెద్ద ఓటమిగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి గెలిస్తే అది బీజేపీకి గట్టి ఎదురుదెబ్బతో పాటు మోదీకి రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తుంది.  2019లో హర్యానాలో  మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.  కానీ, 2024 ఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలను కోల్పోయింది.  కేవలం 5 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో  హర్యానాలో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ భావిస్తోంది.  హర్యానా ఢిల్లీకి పక్కనే ఉండటంతోపాటు అపారమైన రియల్ ఎస్టేట్ సంపదను కలిగి ఉంది. ఒకవేళ హర్యానా ఎన్నికల్లో  బీజేపీ  ఓడిపోతే అది కమలం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే.  ప్రస్తుతం బీజేపీయేతర పార్టీలు జార్ఖండ్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయి.  2024 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఆధిపత్యాన్ని సాధించింది.  జార్ఖండ్​లోని 14  ఎంపీ స్థానాల్లో బీజేపీ 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.  అయితే, బీజేపీయేతర కూటమికి చెందిన అనేక పార్టీలు కూడా పటిష్టంగా ఉండటంతో పాటు వాటికి సొంత ప్రయోజనాలు ఉన్నాయి.  జార్ఖండ్‌‌‌‌ను ఇండియా కూటమి నిలుపుకోవడానికి తప్పకుండా గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

బీజేపీ వ్యూహాలు

మహారాష్ట్రలో 2024 ఎన్నికల ఫలితాలను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తే.. బీజేపీ 48 పార్లమెంటు స్థానాలకుగాను 28 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 9 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. మరోవైపు ఏక్​నాథ్  షిండే నేతృత్వంలోని మిత్రపక్షమైన శివసేన కేవలం 15 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 7 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, అది తక్కువ స్థానాల్లో పోటీ చేసి మిత్రపక్షాలు. చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి.  హర్యానాలో  బీజేపీ 5 మంది ఎంపీలను నిలబెట్టుకోగలిగింది. అయితే మరో 5  స్థానాలను కోల్పోయింది. చాలా చిన్న పార్టీలు  హర్యానాలో ఉన్నా బీజేపీయే ఇప్పటికీ బలీయమైన శక్తిగా ఉంది. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నందున  హర్యానాపై అపారమైన ప్రభావం చూపగలరు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హర్యానాకు చెందిన ముగ్గురు ఎంపీలను ప్రధాని మోదీ తన కేబినెట్​లో మంత్రులుగా నియమించారు.  జార్ఖండ్‌‌‌‌లో 14 ఎంపీ స్థానాలు ఉన్నాయి.  బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 9 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ప్రధాన సమస్య ఏమిటంటే  బీజేపీ వ్యతిరేకత ఈ రాష్ట్రంలో చాలా ప్రబలంగా ఉంది. ఈనేపథ్యంలో శక్తిమంతమైన జార్ఖండ్ ఎంపీలను కేంద్ర కేబినెట్‌‌‌‌లో చేర్చుకునేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది. ఆదివాసీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ఇద్దరు గిరిజనులను ఒడిశా,  చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లకు  ముఖ్యమంత్రులను చేసింది. ఈ రెండు జార్ఖండ్ పొరుగు రాష్ట్రాలు కావడంతో  గిరిజనులకు బీజేపీ స్పష్టమైన సందేశాన్ని అందజేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా అత్యున్నత పదవితో అందలం ఎక్కించింది. జార్ఖండ్‌‌‌‌లో ఈ వ్యూహం బీజేపీకి సత్ఫలితాలను అందించనుంది.

మోదీ వైఖరిలో మార్పు

మోదీ ప్రభుత్వం ఇంతకుముందు చాలా విషయాలపై ఎటువంటి వెసులుబాటు ఇవ్వకుండా మొండిగా వ్యవహరించింది. భారీ ఆందోళనల తర్వాత మాత్రమే తన విధానాలను మార్చుకుంది.  రైతులు ‘వ్యవసాయ చట్టాలకు’ వ్యతిరేకంగా ఉన్నారు.  ఎందుకంటే  చట్టాలపై వారిని సంప్రదించలేదు. అయితే పెద్దఎత్తున ఆందోళనలు చేసిన తర్వాతే మోదీ  ప్రభుత్వం వెనుకడుగేసింది. అదేవిధంగా, సైనిక నియామకాల అగ్నివీర్ సిస్టమ్​ను  పెద్దఎత్తున వ్యతిరేకించారు. కానీ, మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. 2024 నవంబర్‌‌‌‌లో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలు మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాల్.  

ఈ 3 రాష్ట్రాల్లో  బీజేపీ బాగా రాణించగలిగితేనే 2029 నాటికి మార్గం సులభం అవుతుంది. ప్రధాని మోదీ కాస్త గుణపాఠాలు నేర్చుకుని ఫ్లెక్సిబుల్ అవుతారనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మోదీ అదృష్టం అనేవారు ఇప్పటికీ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇదో రకమైన డెత్​ ఎక్స్​పీరియన్స్​. ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నవారు ఎవరైనాసరే  ఇకముందు  జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  కాగా,  మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలకు ప్రధాని నరేంద్ర మోదీ మారిన తన వైఖరిని చూపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఆయన ఇప్పటికే మారిపోయారు. మోదీ నవ్వుతూ ప్రజలను కౌగిలించుకుంటున్నారు. వైఖరిని మార్చుకుని వ్యతిరేకతను అధిగమించకపోతే కనుమరుగు అవక తప్పదని మోదీకి తెలుసు.

బీజేపీ సత్వరం పరిష్కరించాలి

రైతులు :  మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాను ప్రభావితం చేసే అతిపెద్ద  సమస్యల్లో ప్రధానమైనవి  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. 10 ఏండ్లుగా మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం మెరుగైన చర్యలు తీసుకోకపోవడంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 2024 ఎన్నికల్లో  బీజేపీకి రైతులు ప్రధాన సమస్యగా మారనున్నారు.  మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శివరాజ్ సింగ్​ చౌహాన్  కేంద్ర వ్యవసాయ మంత్రిగా నియమితులయ్యారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన  పాలనా సామర్థ్యం సహకరించవచ్చు. 

అగ్నివీర్ : ఇది సైనికుల నియామకంలో కొత్త విధానం.  దీనిపై దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం అగ్నివీర్​ రిక్రూట్‌‌‌‌మెంట్ విధానాన్ని అత్యవసరంగా మార్చవలసిన అవసరం ఉంది. లేదంటే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్​ రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహాన్ని బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

ధరల పెరుగుదల:  ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి 2024  జులైలో  రానున్న బడ్జెట్‌‌‌‌లో భారీ రాయితీలను ఆశించవచ్చు. జులై 2024 బడ్జెట్ నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు.

 



పెంటపాటి పుల్లారావు,పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌