ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచం దృష్టి మొత్తం క్రూడాయిల్ ధరలు, రాజకీయ ఉద్రిక్తతలపైనే ఉంది. కానీ.. ఈ యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో ఎకోసైడ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధం ఆగిపోయినా.. దానివల్ల ప్రకృతిపై పడే ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇప్పటికే బ్లాక్ రెయిన్, యుద్ధ నౌకపై జరిగిన దాడి.. ఎంతో నష్టాన్ని కలిగించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పర్యావరణం పరిస్థితి ఏంటి?
ఒకప్పుడు యుద్ధాల్లో ప్రాణ నష్టం మాత్రమే జరిగేది. వస్తే రాజ్యం.. పోతే ప్రాణం! అన్నట్టు ఉండేది. కానీ.. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అధునాతన ఆయుధాల వాడకం పెరిగింది. అప్పటినుంచి యుద్ధం ప్రభావం మనుషులతోపాటు పర్యావరణం మీద కూడా పడుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన బాంబులు, అణ్వాయుధాలు, షిప్‌రెక్స్‌లు.. భూమి, గాలి, అడవులు, సముద్రాలు, జీవరాశులను దశాబ్దాలపాటు ప్రభావితం చేశాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కూడా పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో యుద్ధం మొదలుపెట్టి మూడు వారాలు దాటింది. ఇరాన్‌లోని చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక స్థావరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, అణు కేంద్రాలపై వేలాది ఇజ్రాయెల్, అమెరికన్ బాంబులు, క్షిపణులు పడ్డాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ లాంటి గల్ఫ్ దేశాలపై ఆత్మాహుతి డ్రోన్‌లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ సంఘర్షణలో ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. దాంతోపాటే మరోవైపు పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింది. విష వాయువులు, బ్లాక్ రెయిన్, సముద్ర కాలుష్యం లాంటివి ఎన్నో జరిగాయి. అందుకే ఎక్స్‌పర్ట్స్ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే “ఎకోసైడ్” (పర్యావరణ వ్యవస్థల విధ్వంసం)కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
- టెహ్రాన్‌లో బ్లాక్ రెయిన్
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దగ్గర్లోని ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆ మంటల వల్ల విడుదలైన పొగ, మసి, ఆయిల్ పార్టికల్స్, సల్ఫర్ సమ్మేళనాలు నల్లటి మేఘాలను ఏర్పరిచాయి. అవన్నీ వర్షపు నీటితో కలిసి “బ్లాక్ రెయిన్”లా కురిసింది. ఆ టైంలో అధికారులు, ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్లు నగరవాసులను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ఆ వర్షం కురిసి దాదాపు రెండు వారాలు దాటినా టెహ్రాన్ నగరవాసుల్లో కొందరు ఇప్పటికీ కళ్ల మంట, తలనొప్పి, మైకం, దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్ లాంటి క్యాన్సర్ కారకాలు కూడా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిపుణులు చెప్పారు. ఇది 1991 గల్ఫ్ వార్‌లో కువైట్ ఆయిల్ ఫైర్స్ తర్వాత వచ్చిన బ్లాక్ రెయిన్లాగే ఉందని, పర్యావరణంపై దీని ఎఫెక్ట్ దశాబ్దాలపాటు ఉంటుందని అంటున్నారు.
- పంటలకూ నష్టమే
ముడి చమురు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు వాతావరణంలోని తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్, నైట్రిక్ ఆమ్లాలుగా మారుతాయి. అవి వర్షపు నీటిలో కలిసి నేలలోకి ఇంకిపోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. పంటలను దెబ్బతీస్తాయి. రిఫైనరీలను పేల్చేసినప్పుడు క్రూడాయిల్ మండుతుంది. దాంతో అందులోని హైడ్రోకార్బన్ల సూక్ష్మ కణాలు గాలిలో కలుస్తాయి. వాటిని పీల్చినప్పుడు ఊపిరితిత్తులలోకి, రక్తప్రవాహంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు, ఆహారం కలుషితం కావడంతో దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి.
- జలచరాలకు తీరని నష్టం
ఆయిల్ ఫెసిలిటీస్ పైన జరిగే దాడులు తీవ్రమైన వాతావరణ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. సముద్రంలో పరిస్థితి అంతకంటే ప్రమాదకరంగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధ నౌకపై అమెరికా నావికాదళ సబ్‌మెరైన్ టార్పిడో దాడి చేసింది. ఆ ప్రమాదంలో నౌక మునిగిపోవడంతోపాటు చాలామంది చనిపోయారు. నౌక నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం లీకయ్యింది. అది సముద్ర ఉపరితలంపై ఇరవై కిలోమీటర్ల వరకు వ్యాపించినట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత మూడు రోజులకు శ్రీలంక దక్షిణ తీరంలోని హిక్కడువా సమీపంలో మందమైన ఆయిల్ ప్యాచ్‌లు కనిపించాయి. 18 కి.మీ. పొడవునా వెవలా, తిరనగమ, కుమారకండ బీచ్‌లపై ఈ ఇంధనం ప్రభావం పడింది.
హిక్కడువా తీరం శ్రీలంకకు ప్రకృతి ప్రసాదించిన అందమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ కోరల్ రీఫ్స్, సీగ్రాస్ బెడ్స్, మాంగ్రోవ్స్, తాబేళ్లు గుడ్లు పెట్టే ప్లేస్‌లు ఉన్నాయి. హైడ్రోకార్బన్ కాలుష్యం వల్ల ఈ సెన్సిటివ్ ఎకోసిస్టమ్‌లు ప్రమాదంలో పడ్డాయి. దీనివల్ల చేపలు, సముద్ర పక్షులు చనిపోయే ప్రమాదం ఉంది. మెరైన్ ఫుడ్ చైన్ దెబ్బతిని చేపల సంఖ్య తగ్గొచ్చు. అదే జరిగితే స్థానిక మత్స్యకారుల జీవనోపాధి ప్రమాదంలో పడినట్టే. అందుకే శ్రీలంక అధికారులు ఉపరితలంపై ఉన్న చమురు తెట్టు (హైడ్రోకార్బన్ రెసిడ్యూల్స్)ను కొంతవరకు తొలగించారు. కానీ.. అసలైన ముప్పు నీటి అడుగున ఉంది. మునిగిపోయిన నౌక నుంచి ఇంకా చాలా రోజుల పాటు ఇంధనం లీకయ్యే ప్రమాదం ఉంది.
- ప్రమాదం అంచున నౌకలు
యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు చాలావరకు తగ్గిపోయాయి. దాంతో ఎన్నో పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్‌లో, జలసంధి సమీపంలో నిలిచిపోయాయి. ఈ ట్యాంకర్లలో కనీసం 21 బిలియన్ లీటర్ల(కొన్ని అంచనాల ప్రకారం ఇంకా ఎక్కువే) చమురు ఉంది. ఇరాన్ నౌకాదళంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, హార్మూజ్ గుండా ప్రయాణించాలనుకునే నౌకలపై ఇరాన్ జరిపే దాడులు కూడా చమురు లీకేజీల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. దాడుల్లో ట్యాంకర్లు దెబ్బతిని ఒక్క స్పిల్ జరిగినా పర్షియన్ గల్ఫ్ మొత్తం కలుషితమవుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడే ప్రముఖ సంస్థ ‘గ్రీన్‌పీస్’ అంచనా ప్రకారం.. 50 వేల టన్నుల ఆయిల్ స్పిల్ జరిగినా ఆ ప్యాచ్ గల్ఫ్ అంతటా వ్యాపిస్తుంది. అది కోరల్ రీఫ్స్, మాంగ్రోవ్స్, సీగ్రాస్ మెడోలును నాశనం చేస్తుంది. చేపలు, డాల్ఫిన్లు, సముద్రపు తాబేళ్లు, పక్షులు చనిపోతాయి.
ఇప్పటికే కొన్ని ట్యాంకర్లు దాడులకు గురై చిన్న చిన్న ఆయిల్ స్పిల్స్ జరిగాయి. ఈ మధ్యే కువైట్ సమీపంలో ఒక ట్యాంకర్‌పై సీ డ్రోన్ దాడి వల్ల స్పిల్ ఏర్పడింది. అమెరికా 60కి పైగా ఇరాన్ నౌకలపై దాడి చేసినట్లు తెలిపింది. ఇలాంటి ఇన్సిడెంట్లు పెరిగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. జలసంధిలో ఉన్న యుద్ధ వాతావరణం, సేఫ్టీ లేకపోవడం వల్ల నౌకల్లో లీకేజీ తనిఖీలు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది. అలాంటప్పుడు ట్యాంకర్లు ఎక్కువ కాలం ఒకే చోట నిలిచి ఉన్నా చిన్న చిన్న లీకేజీల రిస్క్ పెరుగుతుంది.
- ఇంట్లో కాలుష్యం
ఇరాన్ యుద్ధం వల్ల ఇండియా, జపాన్, కొరియా, చైనా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దాంతో బొగ్గు, కిరోసిన్, బయోమాస్(కలప, అగ్రీ వేస్ట్, పేడ) వంటి కాలుష్యకారక ఇంధనాల వినియోగం పెరుగుతోంది. మన దేశంలో కూడా వంటగ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలామంది అవసరం లేకున్నా గ్యాస్ కొంటున్నారు. మరికొంతమంది గ్యాస్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కలప, పిడకల అమ్మకాలు పెరిగాయని నివేదికలు చెప్తున్నాయి. వీటిని వాడడం వల్ల కూడా కాలుష్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల హార్ట్, లంగ్ డిసీజెస్ రిస్క్ పెరుగుతుంది.
- భవిష్యత్తులో విపత్తు తప్పదా?
యుద్ధం వల్ల విడుదలయ్యే గ్రీన్‌హౌస్ గ్యాస్‌లు క్లైమేట్ చేంజ్‌కు కారణమవుతాయి. కాలుష్యం ఎఫెక్ట్ 20 నుంచి 30 సంవత్సరాలపాటు ఉంటుంది. ఇరాన్ ఇప్పటికే నీటి కొరత, వాయు కాలుష్యంతో బాధపడుతోంది. నీరు కూడా కలుషితమైతే వ్యవసాయం, ఆహార సంక్షోభం తప్పదని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్లో పర్యావరణానికి హాని కలిగించే సంఘటనలు 500కు పైగా జరిగాయని చెప్తున్నారు.
