బరువు తగ్గడం అనేది కేవలం కఠినమైన వ్యాయామం వల్ల మాత్రమే కాదు, మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కూడా సాధ్యమవుతుంది. మన శరీరానికి కండరాలు పెరగాలన్నా, కడుపు నిండుగా అనిపించాలన్నా ప్రోటీన్ చాలా ముఖ్యం. మనం జంక్ ఫుడ్ తినడానికి ముఖ్య కారణం అది మనకు వెంటనే అందుబాటులో ఉండటమే. అందుకే ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలను ముందుగానే ఉడికించి ఫ్రిజ్‌లో రెడీ పెట్టుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఉడికించిన గుడ్లు, పనీర్, టోఫు, సోయా, చికెన్ లేదా మాంసం, గ్రీక్ యోగర్ట్ వంటివి ముందుగానే రెడీ చేసి ఉంచుకోవాలి. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే ఆకలి వేసినప్పుడు బయటి చిరుతిండ్లు తినకుండా, ఇంట్లో రెడీ ఉన్న ప్రోటీన్ ఆహారాన్ని వెంటనే తినవచ్చు.
ముందే కట్ చేసి పెట్టుకోండి
కూరగాయల్లో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు మంచిది ఇంకా కడుపు నిండినట్లు భావన కలిగిస్తుంది. కూరగాయలను ముందుగానే వండి పెట్టుకోవడం లేదా కనీసం సలాడ్ కోసం ముక్కలుగా కోసి రెడీ ఉంచుకోవడం వల్ల భోజన సమయంలో కూరగాయలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది.
►ALSO READ | ముప్పైలోనే ముడతలు వస్తున్నాయా..? ఈ నేచురల్ టిప్స్‌తో మళ్ళీ యంగ్ గా మారిపోండి !
భోజనం తక్కువగా
చాలామంది పదే పదే ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా కాకుండా, అవసరమైతే తప్ప తినకూడదని సలహాలు ఇస్తున్నారు నిపుణులు. రోజుకు మూడు పూటల భోజనం సరిపోతుంది. కానీ చాలా ఆకలిగా ఉంటే తప్ప మధ్యలో ఎం తినకండి. ఒకవేళ తినాలనిపిస్తే మధ్యాహ్నానికి, రాత్రికి మధ్యలో చిన్న స్నాక్స్ తీసుకోవచ్చు.
చిరుతిండిగా పండ్లు
మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు సమోసాలు, బిస్కెట్లు లేదా పిజ్జాల జోలికి వెళ్లొద్దు. మీ మూడ్ బాలేనప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు పిజ్జా లాంటివి తినాలనిపిస్తుంది. అలాంటి సమయంలో ఏదైనా ఒక పండు తింటే ఆ కోరిక తగ్గుతుంది ఇంకా కేలరీలు కూడా తక్కువగా అందుతాయి.
నీళ్లు బాగా తాగండి
చాలా సార్లు మనకు దాహం వేసినప్పుడు, అది ఆకలి అనుకుని పొరబడి ఏదో ఒకటి తినేస్తుంటాం. దీనివల్ల అనవసరమైన కేలరీలు శరీరానికి చేరుతాయి. కాబట్టి ప్రతిసారి భోజనం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి. దీనివల్ల మీరు తక్కువ ఆహారం తింటారు ఇంకా అతిగా తినాలనే కోరిక కంట్రోల్లో ఉంటుంది.
