- ఆదాయపన్ను శాఖ దృష్టిలో పడతామనే టెన్షనే కారణం
- అద్దెకున్నోళ్లనూ అడ్డుకుంటున్న యజమానులు
- ఆమేరకు రెంట్లో తగ్గిస్తామని నచ్చజెప్పుతున్న వైనం
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉచిత విద్యుత్ పథకం ‘గృహ జ్యోతి’ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని గృహ వినియోగదారులు అందరికీ నెలనెలా 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం.. ఆపై వాడుకున్న వారు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అనూహ్యంగా ఈ పథకాన్ని చాలా మంది ఇంటి ఓనర్లు వద్దనుకుంటున్నారు. తమ ఇళ్లల్లో అద్దెకు ఉన్న వారికి కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారట. కొంతమంది నెలనెలా చెల్లించే రెంట్లో ఆమేరకు తగ్గిస్తున్నారని సమాచారం.
ఆదాయపన్ను శాఖ దృష్టిలో పడతామనే భయం..
ఉచిత విద్యుత్ పథకానికి ఇంటి ఓనర్లతో పాటు అద్దెకు ఉండేవాళ్లు కూడా అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అడ్రస్ ప్రూఫ్ లేదా రెంట్ అగ్రిమెంట్ పేపర్లతో దరఖాస్తు చేసుకుంటే ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేస్తామని తెలిపింది. దీనిపై అద్దెకు ఉండే వాళ్లు సంతోషం వ్యక్తం చేయగా.. ఓనర్లు మాత్రం టెన్షన్ పడుతున్నారు. తమ ఇళ్లల్లో అద్దెకు ఉండే వాళ్లంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే తమ ఆస్తులు, ఆదాయ వివరాలన్నీ ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతాయని, దీంతో ఆదాయ పన్ను అధికారుల దృష్టిలో పడతామని ఆందోళన చెందుతున్నారు. ఎందుకొచ్చిన రిస్క్ అని చెప్పి ఈ పథకాన్ని వదులుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే మినహాయింపును రెంట్ లో తగ్గించి, అద్దెకు ఉండే వాళ్లను కూడా ఈ పథకానికి దూరం చేస్తున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘శక్తి’ ని కర్నాటక ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు బెంగళూరులో సీఎం సిద్దరామయ్య శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వచ్చింది. మొత్తంగా రాష్ట్రంలోని 41.8 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ఆర్టీసీ శక్తి స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. కార్డులు అందుబాటులోకి వచ్చే వరకూ ఫొటో గుర్తింపు కార్డును చూపించి టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని సీఎం పేర్కొన్నారు.

