
న్యూఢిల్లీ: మన ఎకానమీ మరింత బలోపేతం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని ప్రైమ్‌మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నారు. దీనికి తగిన ఇంపార్టెన్స్ ఇస్తే 2047 నాటికి మనది ధనిక దేశం అవుతుందని చెప్పారు. ఇన్ఫ్రా అభివృద్ధి టాప్‌గేర్‌లో ఉండాలని కామెంట్ చేశారు. దీనిని పెంచడానికి తమ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని అన్నారు. 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్: ప్రధాన మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌తో లాజిస్టిక్స్ కెపాసిటీని పెంచడం' అనే అంశంపై నిర్వహించిన పోస్ట్-బడ్జెట్ వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2023–24 కేంద్ర బడ్జెట్‌లోని వివిధ అంశాలపై మోడీ వరుసగా వెబ్నార్లలో మాట్లాడుతున్నారు. తాజా బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు చాలా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. 2013–14తో పోలిస్తే భారతదేశ మూలధన వ్యయం (క్యాపెక్స్) ఐదు రెట్లు పెరిగిందని, జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ కింద రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆయన చెప్పారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి అన్ని రంగాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ఫలితంగా వ్యాపారాల్లో పోటీతత్వం పెరుగుతుందని, రవాణా ఖర్చులు తగ్గుతాయని ప్రైమ్‌మినిస్టర్ వివరించారు. "ఏ దేశ అభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు ఎప్పుడూ ముఖ్యమైనవి. ఎక్స్పర్టులకు ఈ విషయాలు చాలా బాగా తెలుసు. అంతకుముందు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మా ప్రభుత్వం ఈ పరిస్థితుల నుండి దేశాన్ని బయటకు తీసుకురావడమే కాకుండా, ఆధునిక మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది" అని ఆయన అన్నారు.
ఎన్నో విజయాలు సాధించాం..
2014 నుండి జాతీయ రహదారుల సగటు నిర్మాణం దాదాపు రెట్టింపు అయ్యిందని, రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ 600 రూట్ కిలోమీటర్ల నుండి 4,000 రూట్ కిలోమీటర్లకు పెరిగిందని ఆయన అన్నారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య దాదాపు 150కి పెరిగిందని మోడీ వివరించారు. ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది ఆర్థిక మౌలిక సదుపాయాల ప్లాన్‌ను అభివృద్ధితో లింక్ చేసే కీలకమైన స్కీమ్అని మోడీ అన్నారు. గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారతదేశ లాజిస్టిక్స్ రంగంలో ఎన్నో ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గతి శక్తి యోజన ఎన్నో విజయాలను సాధించిందని కూడా కూడా ప్రైమ్మినిస్టర్చెప్పారు. "క్వాలిటీ, మల్టీమోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల రాబోయే రోజుల్లో రవాణా ఖర్చు మరింత తగ్గుతుంది. మన ఇండస్ట్రీలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా మెరుగుపడుతుంది. బలమైన సామాజిక మౌలిక సదుపాయాలు మరింత ప్రతిభావంతులైన యువతను తయారు చేస్తాయి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ స్కిల్స్, ఎంటర్‌ప్రెనూర్‌షిప్ అవసరం. వివిధ రంగాలకు చెందిన చిన్న, పెద్ద పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి”అని పేర్కొన్నారు