మాయామశ్చీంద్ర! .. సర్కారీ దఫ్తర్ల నుంచి ఫైళ్లు మాయం

మాయామశ్చీంద్ర! .. సర్కారీ దఫ్తర్ల నుంచి ఫైళ్లు మాయం
  • ధరణిలో కరస్పాండెన్స్ కాగితాల్లేవ్!
  •  నీటిపారుదలశాఖలోనూ అదే తీరు
  • సీనియర్ ఐఏఎస్ ల మెడకు ఉచ్చు
  • లేదంటే కిందివారే బలిపశువులు
  •  అక్రమాలు బయటపడతాయనేనా?
  • మొన్న తలసాని ఆఫీసు నుంచి 
  • సబిత కార్యాలయం నుంచి అదే తీరు
  • సీరియస్ గా పరిగణిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్: అక్రమాల పుట్ట పగులుతుందనే భయం గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిని వెంటాడుతోంది. ఇందుకోసం వాళ్లంతా ఆధారాలు మాయం చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొందరు ఫైళ్లుమాయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. సర్కారు చేసిన తప్పిదాలు, రూల్స్ కు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు సీనియర్ ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి.  కొందరు తెలివిగా సైడ్ అయిపోతూ కిందివారిని బలిపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిన్న జరిగిన ధరణిలో పెద్దస్థాయిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు మాయమైనట్టు తెలుస్తోంది. వందల ఎకరాల్లో క్లియరెన్స్ ఇచ్చిన కేసుల్లో, కరస్పాండెన్స్ కాగితాలు లేకుండా కుట్ర చేస్తున్నట్లు సమాచారం. అక్రమాలు బయటపడకుండా, తాము ఇరుక్కోకుండా ఆఫీసర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బంది, ధరణి ఆపరేటర్ల పై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నట్టు రెవెన్యూ శాఖలో చర్చ నడుస్తోంది. ధరణి అక్రమాలపై అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారులపైనా ఆరోపణలు వచ్చాయి. పోర్టల్ రూపకల్పన నుంచి భూముల అక్రమ బదలాయింపు వరకు వాళ్లు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.  మొన్నటి వరకు అందులో కొందరు కీలక స్థానాల్లో కొనసాగారు. వాళ్లు గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను సరైన ఆర్డర్లు లేకపోయినా, దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు కట్టబెట్టారనే విమర్శలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ ఎంట్రీ ఇచ్చింది. 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. అందులో కీలక ఫైళ్లు మాయమైనట్టు అధికారులు చెబుతున్నారు. 

గొర్రెల అవినీతి బయటపడ్తుందనా? 

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన మర్నాడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్.. పశు సంవర్ధక శాఖలోని ఫైళ్లను చించేశారు. అది కాస్తా సిబ్బంది, మీడియా కంట పడడంతో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఫైళ్లను ఎందుకు చించేస్తున్నారని ప్రశ్నిస్తే  బీరువాలో పెట్టిన ఫైళ్లను ఎలుకలు కొడుతున్నాయని, అందుకే చించేస్తున్నామని, కొన్నింటిని తరలిస్తున్నామని పొంతనలేని సమాధానాలు చెప్పారు. గొర్రెల పంపిణీ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వంలో వాటిపై విచారణ జరిపి ఫైళ్లను బయటకు తీస్తే.. అవినీతి బాగోతం బయటపడుతుందనే ఫైళ్లను చించేశారనే ఆరోపణలున్నాయి.

విద్యాశాఖలోనూ ఫైళ్లు మాయం

విద్యాశాఖలోనూ కీలక ఫైళ్లను మాయం చేసే ప్రయత్నం జరిగింది. బషీర్​బాగ్​లోని విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆఫీస్​లో ఉద్యోగులే ఫైళ్లు, సామగ్రిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓ ఉద్యోగి సమాచారంతో మీడియా అక్కడకు చేరుకోగా వాళ్లు కాస్తా పరారయ్యారు. గతంలో ఇదే బిల్డింగ్​లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసు ఉండడం గమనార్హం. ఉద్యోగులే సామగ్రిని తరలించడం, మీడియా అడగడంతో అక్కడి నుంచి పారిపోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.