హైదరాబాద్, వెలుగు: ఇండ్లను ఆకర్షణీయంగా మలచడంలో కీలకమైన కర్టెన్ల కోసం జనం బాగా ఖర్చు చేస్తున్నారని ఫర్నిషింగ్ ఎక్స్పర్ట్ అంకిత్ గోయల్ వెల్లడించారు. హైదరాబాద్ వాసులు వీటి కోసం లక్షలాది రూపాయలు పెట్టడానికి కూడా వెనకాడటం లేదని చెప్పారు. తెలంగాణ హోమ్‌డెకర్ మార్కెట్ సైజు రూ.1,500 కోట్లు కాగా, హైదరాబాద్ మార్కెట్ విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 15న తమ డెకర్ వరల్డ్ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
దాదాపు రూ. 1.5 కోట్ల పెట్టుబడితో, 2,300 చదరపు అడుగుల్లో ఈ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ధరలు మీటర్‌కు రూ. 1500 నుండి రూ. 30 వేల వరకు ఉంటాయని, వందకుపైగా సరికొత్త కాన్సెప్ట్ కర్టెన్లను ప్రదర్శిస్తామని అంకిత్ గోయల్ తెలిపారు. కస్టమర్ తన ఆర్కిటెక్ట్‌తో కలిసి మా స్టోర్‌కు రావాలి. కర్టెన్లను డెలివరీ చేయడానికి దాదాపు 45 రోజుల వరకు టైం పడుతుంది. మోటరైజ్డ్, ఆటోమేషన్, డిజైనర్, థీమ్, లగ్జరీ బెడ్‌రూమ్ కర్టెన్లు మా కలెక్షన్లో భాగం. హోమ్ డెకర్ సెగ్మెంట్ మార్కెట్ ప్రతి సంవత్సరం 7 శాతం పెరుగుతోంది. కిందటి ఏడాది మా టర్నోవర్ రూ. 22 కోట్లు కాగా, ఈ కొత్త స్టోర్‌తో ఈ ఏడాది రూ. 40 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మా టర్నోవర్ ఏటా 20 శాతం పెరుగుతోంది”అని ఆయన వివరించారు.
