వరంగల్ డిక్లరేషన్ పేరుతో సాధ్యం కాని హామీలు

 వరంగల్ డిక్లరేషన్ పేరుతో సాధ్యం కాని హామీలు
  • ఒకేసారి 2లక్షల రుణమాఫీ సాధ్యం కాదు
  • తాతల ఆస్తులు అమ్ముకుని సోకులు చేస్తున్నట్లుంది కేసీఆర్ పరిస్థితి
  • లిక్కర్ ద్వారా వస్తేనే ఆదాయం.. లేకుంటే ఆస్తులు అమ్మే పరిస్థితి
  • మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్

కరీంనగర్: వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని.. ఆర్ధిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా.. ఒకేసారి 2లక్షల రుణమాఫీ సాధ్యం కాదు అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అయినా లక్ష రూపాయల రుణ మాఫి చేయలేదని ఆయన తెలిపారు. హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో  ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఏది చేయగలరో అది చెప్పాలి అంతేకానీ.. ఆచరణ సాధ్యం కానీ  హామీలు ఇవ్వొద్దని రైతులు అంటున్నారని చెప్పారు. ఎకరానికి 15 వేలు ఒకేసారి ఇస్తారా? ఎలా ఇస్తారు?  దానికి క్లారిటీ లేదు.. మొదటి పంటకి ఇస్తారా?  రెండో పంటకి ఇస్తారా? అని ప్రశ్నించారు. 
నాలుగుసార్లు మేనిఫెస్టో రాసినా అమలు కాలేదు
తాను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాలుగు సార్లు మేనిఫెస్టో రాసినా అది అమలు కాలేదని..ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకుని సోకులు చేస్తున్నట్లుంది కేసీఆర్ పరిస్థితి.. లిక్కర్ ద్వారా వస్తేనే ఆదాయం.. లేకుంటే ఆస్తులు అమ్మే పరిస్థితి నెలకొందని అన్నారు. పెన్షన్లు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. డబల్ బెడ్ రూంలు లేవు.. చేతగాని సీఎం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కి   నిజాయితీ లేదు.. తన ఉనికి ఉండాలనే  వేలాది మంది పొట్ట కొట్టి నిర్మించిన యాదాద్రిలో  అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తానే స్వయంభూ ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఎన్నో సార్లు పర్యటించి నాణ్యత లేని గుడిని నిర్మించారని విమర్శించారు.
బాగున్నసెక్రటేరియట్ కూల్చి.. వెయ్యికోట్లతో కొత్తది కట్టడం అవసరమా..? 
 నిజం నవాబుల తమ్ముడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఇతర సీఎంల ఉనికి ఉండవద్దని రాష్ట్ర సచివాలయన్నీ కూల్చి కొత్తది కడుతున్నారని, కష్టాల పరిస్థితుల్లో 1000 కోట్లు పెట్టి సచివాలయం నిర్మించడం అవసరమా.? అని ఈటల రాజేందర్ ప్రవ్నించారు. మాట మాట్లాడితే రైతుల కోసమే పుట్టినట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు, దేశంలోనే ధనవంతులైన రైతులు ఇక్కడే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు, తన మార్గంలోనే కేంద్రం ప్రయాణిస్తోందని గొప్పలు చెప్పకుంటున్నారు, ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా రైతుల కళ్లల్లో మట్టిగొట్టి, వాళ్ల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న పేద రాష్ట్రం ఛత్తీస్ గఢ్ లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మద్దతు ధరపై అదనంగా 540 రూపాయలు అందించాడని, కానీ మన దగ్గర ఇప్పటికీ అనేక చోట్ల కొనుగోలు సెంటర్లే ఓపెన్ కాలేదు, గన్నీ సంచీలు కూడా లేవు, ఇప్పటికే సగం పంటను రైతులు బయటి ప్రాంతాలకు అమ్ముకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
ప్రతి క్వింటాలకు 7.5 నుంచి 10కిలోలు కోత
ఐకేపీ సెంటర్లలో మహిళా సంఘాల వాళ్లే రైసు మిల్లులతో మాట్లాడుకోమని చెబుతున్నారని, ప్రతి క్వింటాలుకు 7.5 నుంచి 10 కిలోలు కోత విధిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. హమాలీ చార్జీలు కేంద్రం ఇస్తున్నా.. రైతుల నుంచి 35 రూపాయలు హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారని, అంతేకాదు తేమ శాతం, తాలు పేరుతో 20-30 రోజులు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటే తక్కువ, దీనికి మద్దతు ధర ఇచ్చి కొనాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అకాల వర్షాలకు వరి కొట్టుకుపోయింది, కొంత తడిసిపోయింది, ధాన్యం తడిచినా కొంటామని చెప్పినా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవన్నారు.  
తెలంగాణ సర్కార్ రైసు మిల్లులకు కొమ్ముకాస్తూ రైతులకు మాత్రం సహకరించడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. మిల్లర్లు సకాలంలో బియ్యం ఎఫ్.సి.ఐ.కి ఇవ్వడం లేదన్నారు. పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రైసు మిల్లులు సంఖ్య పెరగకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని, తెలంగాణ సర్కారు మిల్లర్లకు మిషనరీలు కొనుక్కునే సబ్సిడీ ఇవ్వడం లేదని, ప్రభుత్వ పరంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, మిల్లులకు సపోర్టు చేస్తామని సీఎం ఇచ్చిన హామీలు కూడా అమలు కావడం లేదు, మిల్లర్ల మీద ఎఫ్.సి.ఐ పగబట్టినట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. 
కొనుగోలు చేసిన ధాన్యమంతా మిల్లుల్లో ఉందా? లేదా ? అనేది తెలుసుకునేందుకే తనిఖీలు
కొనుగోలు చేసిన ధాన్యమంతా మిల్లుల్లో ఉందా? లేదా ? అనేది తెలుసుకునేందుకే తనిఖీలు చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. రైసు మిల్లర్లంతా గత రబీకి సంబంధించిన  బాయిల్డ్ రైస్ తీసుకోవాలని చేసిన విజ్ఞప్తి మేరకు 5.5 లక్షల పారాబాయిల్డ్ రైసు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని వివరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సహాయం  అందిస్తోందన్నారు. 
వ్యవసాయం సన్నగిల్లితే నిరుద్యోగం, పేదరికం పెరుగుతుంది
వ్యవసాయం సన్నగిల్లితే నిరుద్యోగం.. పేదరికం పెరగుతుందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే కేంద్రం లక్ష కోట్లకు పైగా సబ్సిడీలు ఇస్తోందన్నారు.  నాబార్డు ద్వారా లక్షల కోట్లు సహాయం చేస్తోందని, ఇన్ని చేస్తున్నా కేంద్రంపై ఆడిపోసుకోవడం సరికాదన్నారు. మోసం చేస్తున్నది కేంద్రం కాదు... డ్రామాలు, మోసాలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మోసం చేసేది కేంద్ర ప్రభుత్వం కాదని కేసీఆర్ ప్రభుత్వమేనని రైతులకు తెలిసిపోయిందన్నారు. 

 

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో ఉండొద్దు... ప్రజల్లో తిరగండి

NSUI నేతలకు రాహుల్,కాంగ్రెస్ నేతల పరామర్శ