
- రోజురోజుకు పెరుగుతున్న సందర్శకుల సంఖ్య
- మెయింటెనెన్స్‌ను పట్టించుకోవాలని కోరుతున్న సిటిజన్లు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఏర్పాటు చేసిన థీమ్ పార్కులకు సిటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధారణ పార్కులకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో సిటిజన్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. చిన్నారులకు ఆట స్థలాలు, పెద్దలకు ప్రశాంతత ఉండేలా వీటిని తీర్చిదిద్దుతుండటంతో అక్కడకు వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. సిటీలో ఇప్పటికే ఇలాంటి ఆరు పార్కులను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకుకొచ్చింది.
వాకింగ్ ట్రాక్‌లు.. ప్లే ఏరియా
కాలనీలు, బస్తీ వాసులు సేదతీరేలా గ్రేటర్ వ్యాప్తంగా రూ.132 కోట్లతో 57 థీమ్ పార్కులను బల్దియా డెవలప్ చేస్తోంది. చార్మినార్ జోన్‌లో మూడు చోట్ల పనులు జరుగుతున్నాయి. ఎల్‌బీనగర్ జోన్‌లో 13 ఏర్పాటు చేస్తుండగా.. ఒకటి పూర్తయ్యింది. ఖైరతాబాద్ జోన్‌లో 14 పార్కులకు గాను ఒకటి అందుబాటులోకి వచ్చింది. శేరిలింగంపల్లి జోన్‌లో 10 ఏర్పాటు చేస్తుండగా.. రెండు చోట్ల పనులు పూర్తయ్యాయి. కూకట్పల్లి జోన్‌లో 6 పార్కులకు గానూ విమెన్ అండ్ చైల్డ్ స్పెషల్ థీమ్ పార్క్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్ జోన్‌లో 11 కు గాను ఒక చోట పనులు పూర్తయ్యాయి. ఈ థీమ్ పార్కులను అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు, ప్లే ఏరియా, యోగా సెంటర్ అందుబాటులో ఉంటున్నాయి. విమెన్స్ పార్కులో మహిళలు మీటింగ్స్ పెట్టుకునేందుకు ఓ ప్రత్యేక రూమ్ ఉండేలా చూస్తు
న్నారు. కానీ చాలా చోట్ల తాగునీరు, వాష్‌రూమ్‌లు లాంటి కనీస సౌకర్యాలు ఉండట్లేదని.. దీంతో ఎక్కువ టైమ్ అక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్నట్లు సందర్శకులు చెబుతున్నారు.
ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేసుకునేలా..
ఉప్పల్ చౌరస్తాలో దాదాపు ఎకరం స్థలంలో గ్రీన్ పార్కును ఏర్పాటు చేశారు. ఉప్పల్‌లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటంతో టెకీలు ల్యాప్ టాప్‌తో పార్కులో వర్క్ చేసుకునేలా సాకెట్లు ఏర్పాటు చేశామని సిబ్బంది చెబుతున్నారు. అయితే, ఈ పార్కు మెయిన్‌రోడ్డుపై ఉండటం.. ఉప్పల్ ఏరియాలో స్కైవే వర్క్స్ జరుతుండటంతో ఆ రూట్‌ను అధికారులు క్లోజ్ చేశారు. దీంతో ఇక్కడికి వచ్చే జనాల సంఖ్య తగ్గింది. బైక్, కారు పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో వచ్చిన
కొద్దిమంది కూడా పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ పార్కు మహిళలు, పిల్లల కోసమే ..
మహిళలు, చిన్నారుల కోసం కేహీహెచ్ బీలో విమెన్ అండ్ చిల్డ్రన్ పార్కును జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఈ పార్కును డెవలప్ చేశారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలంలోనే ఈ థీమ్ పార్కు ఉంది. పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లు, యోగా, కిట్టి పార్టీల కోసం ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్‌ను బల్దియా డెవలప్ చేయగా.. వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్‌ను హౌసింగ్ బోర్డు నిర్మించింది. కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ వాసుల నుంచి ఈ థీమ్ పార్కుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయంత్రం వేళ మహిళలు తమ పిల్లలను తీసుకెళ్లి పార్కుకు వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
విమెన్ పార్కు బాగుంది
విమెన్ అండ్ చైల్డ్ థీమ్ పార్క్ బాగుంది. గతంలో టైమింగ్స్ సరిగా లేక ఇబ్బంది అయ్యేది. అప్పుడప్పుడు పార్కుకు తాళం వేసి ఉండేది. కానీ ఇప్పుడు బాగా మెయింటెన్ చేస్తున్నారు. మా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తున్నాం. మెయింటెనెన్స్ విషయంలో అధికారులు మరింత దృష్టిపెడితే బాగుంటుంది.
- మానస, కేపీహెచ్‌బీ